నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. ‘ఎప్‌స్టీన్‌’తో పోల్చిన బీఆర్ఎస్ నేత

by Ramesh Naini |   (  Updated:2026-02-07 12:51:10  IST  )

ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారు.. అమెరికాలో ఎంతో మంది చిన్నారులను అపర కుబేరులకు అర్పించిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడు.

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. ‘ఎప్‌స్టీన్‌’తో పోల్చిన బీఆర్ఎస్ నేత
X

దిశ, డైనమిక్ బ్యూరో: నగరంలోని అత్యంత కీలకమైన నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 40 నుంచి 50 కంప్యూటర్లు పూర్తిగా దగ్ధమైనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన చోటే వివిధ సంచలన కేసులకు సంబంధించిన హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు ఉన్నట్లు సమాచారం. డిజిటల్ సాక్ష్యాలు అగ్నికి ఆహుతి కావడంతో దర్యాప్తు సంస్థల్లో ఆందోళన మొదలైంది.

ఎప్‌స్టీన్’తో పోల్చిన ఆర్ఎస్పీ

ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందించారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రగా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘అత్యంత భద్రత ఉండే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2015 నాటి ఓటుకు నోటు కేసుతో సహా అనేక సున్నితమైన కేసుల ఆధారాలు ఇక్కడే ఉన్నాయి. ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారు.. అమెరికాలో ఎంతో మంది చిన్నారులను అపర కుబేరులకు అర్పించిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడు’ అని ఆయన శనివారం ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

కేటీఆర్ ఘాటు స్పందన..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఓటుకు నోటు కేసులోని వాయిస్ రికార్డింగ్‌లను మాయం చేయడానికి, అలాగే ఫోన్ ట్యాపింగ్ వంటి రాజకీయ కేసుల్లో తమ వద్ద ఆధారాలు లేవనే నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ అగ్నిప్రమాదం సృష్టించారని నేను భావిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. కాగా, ప్రస్తుతం పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా లేక దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Next Story