BRS: ఇంత పదవీ వ్యామోహం వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-25 17:21:54  IST  )

కడియం శ్రీహరిది ఆత్మవంచన అని.. ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

BRS: ఇంత పదవీ వ్యామోహం వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కడియం శ్రీహరిది ఆత్మవంచన అని.. ఆయనకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని కడియం ప్రకటించిన నేపథ్యంలో స్పీకర్ వెంటనే ఆయనపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కడియం శ్రీహరి పార్టీ మార్పుపై ఆయన చెప్పిన కారణాలు, తెలంగాణ ప్రజల విజ్ఞతను అపహాస్యం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు అవకాశవాద రాజకీయానికి, పదవీ వ్యామోహానికి పరాకాష్ట అని తెలిపారు. పదేళ్ల పాటు ఆయన భాగస్వామ్యమైన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని స్వయంగా కాలరాయడమే అని పేర్కొన్నారు. ఇది స్టేషన్ ఘనపూర్, వరంగల్ ప్రజల తీర్పును అవమానించడమేనని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులు అనుభవించారని.. అప్పుడు కనిపించని అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోగానే కనిపించిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు అనుభవించిన పదవులు అభివృద్ధికి అడ్డువచ్చాయా? అని నిలదీశారు.

తాను ఏ పార్టీలో ఉండాలో అక్కడే ఉన్నాను అనడం ఆయన రాజకీయ అస్థిరత్వానికి నిలువుటద్దమని.. ఇది ఒక సీనియర్ నాయకుడు అనాల్సిన మాట కాదని తెలిపారు. కేవలం పదవి కోసం వెంపర్లాడే ఫిరాయింపుదారుడి ఆత్మవంచన అని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ఇప్పుడు అదంతా అభివృద్ధి కాదని చెప్పడం సిగ్గుచేటు కాదా అని నిలదీశారు. మిషన్ భగీరథతో ఆడపడుచుల కష్టాలు తీర్చింది అభివృద్ధి కాదా అని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాలకు సాగునీరు అందించి, తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మార్చింది అభివృద్ధి కాదా? అని ప్రశ్నించారు. వరంగల్‌కు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, హెల్త్ సిటీ, మెడికల్ కాలేజీలు, స్మార్ట్ సిటీ వంటి వందల కోట్ల ప్రాజెక్టులు తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమని.. ఇవన్నీ పదవి వ్యామోహంతో కళ్లుమూసుకుపోయాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొని ప్రజా తీర్పును కాలరాయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని.. ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించని నాయకులు రాజకీయ బ్రోకర్లతో సమానమని.. వీరికి ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. ఓటు చోరీ జరిగిందని బట్టలు చించుకుంటున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో ఆయన పార్టీ చేస్తున్న ఎమ్మెల్యేల దొంగతనం గురించి ఎందుకు మాట్లాడారని నిలదీశారు. గల్లీలో ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ఢిల్లీలో ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీకి నిజంగా ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలందరితో వెంటనే రాజీనామా చేయించి, ఉప ఎన్నికలకు సిద్ధం చేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్, ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ ఫిరాయింపుల నాటకానికి తెరలేపిందని ఆరోపించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారే రాజకీయ బ్రోకర్లను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు.

Next Story