‘మిస్టర్ ఉత్తమ్.. ఇప్పటికీ మించిపోయిందేం లేదు’.. హరీశ్‌ రావు సూచన

by Gantepaka Srikanth |

మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్‌డీఎస్ఏ తన నివేదికలో ఎక్కడా చెప్పలేదని, అవినీతి జరిగినట్లు చెప్పడానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

‘మిస్టర్ ఉత్తమ్.. ఇప్పటికీ మించిపోయిందేం లేదు’.. హరీశ్‌ రావు సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్‌డీఎస్ఏ తన నివేదికలో ఎక్కడా చెప్పలేదని, అవినీతి జరిగినట్లు చెప్పడానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రయాస, ఆపసోపాలు చూస్తే జాలి కలిగిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ ఎన్డీఎస్ఏ రిపోర్టును అడ్డం పెట్టుకొని పాత చింతకాయ పచ్చడిలాగా రాజకీయం ప్రసంగాన్ని కొనసాగించారని అన్నారు. ఉనుక మీద రోకలోలె దుంకులాడుడే తప్ప, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, సారం లేదని అన్నారు. ప్రెస్‌మీట్ అంటూ రెండు సార్లు ప్లేస్ మార్చారని, మూడు సార్లు టైమింగ్స్ మార్చారని.. తీరా చూస్తే ఈ సారి కూడా ఉత్తమ్ ప్రిపేర్ అయినట్లు లేరని ఆరోపించారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక ఎల్లెంకల పడ్డరని అన్నారు. ఎన్డీఎస్ఏ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్ పక్షాన లోక్‌సభలో వ్యతిరేకించింది ఇదే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని, అప్పుడు ‘ఇట్స్ అన్ కానిస్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచెమెంట్ అపాన్ స్టేట్ రైట్స్’ అంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి వారికి ఎన్డీఎస్ఏ రిపోర్టు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లాగా కనిపిస్తున్నదని చెప్పారు. అప్పుడు రాంగ్ అయ్యింది, ఇప్పుడు రైట్ ఎట్ల అయ్యిందని ప్రశ్నించారు.

అసెంబ్లీకి ముందు ప్రాథమిక రిపోర్టు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాథమిక.. పార్లమెంట్ అప్పడు ఇంటీరియం రిపోర్టు.. రజతోత్సవం వేళ తుది రిపోర్టు అని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందన్నారు. ఊరు వాడా తేడా లేకుండా, పల్లె పట్టణం తేడా లేకుండా కేసీఆర్ ప్రసంగంపైనే చర్చించారన్నారు. రజతోత్సవ సభను డైవర్ట్ చేసేందుకు ప్రభుత్వం భారత్ సమ్మిట్ అన్నదని, రైతు మహోత్సవాలు చేశారని, వాటితో ఫలితం లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ కకావికలమైందన్నారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టుతో వచ్చి లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. పోలవరం అథారిటీ చైర్మన్‌గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్ ఎన్డీఎస్ఏ చైర్మన్ అయ్యారని.. ఆయన పోలవరం కడితే కుప్ప కూలిందని అన్నారు. ఇప్పటివరకు ఎన్డీఎస్ఏ పోలవరం ప్రాజెక్టును ఎందుకు విజిట్ చేయలేదని ప్రశ్నించారు. నాలుగైదు ఏండ్లు అయినా పోలవరానికి ఎన్డీఎస్ఏ ఎందుకు పోదని నిలదీశారు. ఎన్డీఎస్ఏను ఈడీ, సీబీఐ లెక్క వాడుతున్నరని ఆరోపించారు.

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు

ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై చేస్తున్న పని అని హరీశ్‌రావు అన్నారు. ఎస్ఎల్బీసీ కంటే ఇందులో పెద్ద డిజాస్టర్ ఏముందని ప్రశ్నించారు. మహారాష్ట్ర, ఏపీ, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఎందుకు తమ్మిడిహెట్టికి అంతర్ రాష్ట్ర ఒప్పందం చేయలేదని.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం, పర్సంటీజీల కోసం టెండర్లు పిలిచి, ఎక్కడో చేవెళ్ల కాడ తవ్వారని.. తప్పు చేసింది మీరు, తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వైయస్ ప్రభుత్వం 2008లో శంఖుస్థాపన చేసిందని.. నాలుగేళ్లలో పూర్తవుతందని చెప్పారని.. ఏడేండ్లు అధికారంలో ఉండి కనీసం అంతర్ రాష్ట్ర ఒప్పందం చేయలేదని అన్నారు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు ఉత్తమ్ అంటూ ప్రశ్నించారు. సర్వే మొబిలేజేషన్ అడ్వాన్స్ పేరిట రూ.1,426 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారని, 160 కోట్ల భూసేకరణ కోసం ఖర్చు చేశారని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, ఆ దోపిడీలో ఉత్తమ్ కూడా ఉన్నారని గుర్తుచేశారు. అన్ని రకాల టెస్టులు జరిగాకే, డిజైన్లు ఆధారంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు.

తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని సీడబ్ల్యూసీ నిర్ధారణ

నాడు మహారాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో చర్చలు జరిపామని, కేసీఆర్ మాట్లాడారని, తాను వెళ్లి ముషారఫ్ అనే ఇరిగేషన్ మంత్రితో చర్చలు జరిపానని హరీశ్ తెలిపారు. ఎంత డబ్బయినా ఇస్తం, తుమ్మిడిహెట్టి వద్ద అనుమతి ఇవ్వాలని అడిగామని చెప్పారు. కానీ.. అంత ఎత్తుమీద తాము ఒప్పుకోమని స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఉత్తమ్ విజ్ఞానంతో కాకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవు అని సీడబ్ల్యూసీ చెప్పిందని.. ఇదే విషయాన్ని పది సార్లు చెప్పామని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీళ్ళు ఉండవని లెటర్ రాసిందని, మరో లెటర్‌లో భవిష్యత్తులో నీటి లభ్యత ఉండదని వెల్లడించిందని చెప్పారు. రెండు సార్లు సీడబ్ల్యూసీ ఉత్తరాలు రాసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవని అనడంతో తుమ్మడిహెట్టి నుంచి వేరే చోటుకు తప్పని పరిస్థితిలో నీళ్లు ఉన్న చోట మేడిగడ్డ వద్దకు మార్చామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ వద్ద కట్టాలని చెబితే కట్టామన్నారు. 220 టీఎంసీల నీళ్లు తీసుకునే అనుమతి సీడబ్ల్యూసీ నుంచి సాధించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థానం మారలేదా? ఏలేశ్వరం నుంచి నంది కొండకు మారలేదా? ఎస్సారెస్పీ ప్రాజెక్టు కుస్తాపురం నుంచి పోచంపాడుకు మారలేదా? అని ప్రశ్నించారు. పరిస్థితులు, ముంపు, అవసరాలను బట్టి మారుతాయన్నారు. తాము ఆయకట్టు పెంచడం వల్లే ఖర్చు పెరిగిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాక డీపీఆర్ ఇచ్చారని అంటున్నారని.. కొడంగల్ నారాయణ్ పేట్ లిఫ్టుకు ఇప్పటివరకు డీపీఆర్ ఉందా అని ప్రశ్నించారు.

టెండర్లు పిలిచి, ప్రాజెక్టు కడుతున్నారని అన్నారు. ‘మిస్టర్ ఉత్తమ్.. మీకో నీతి మాకో నీతా..’ అని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్, 231 కిలో మీటర్ల గ్రావిటి కెనాల్, ఇవన్నీ బాగున్నాయని, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ సహా నుంచి ఇప్పటికీ సాగు నీళ్లు వస్తున్నాయని, ఇవి కాళేశ్వరంలో భాగం కాదా, మరి లక్ష కోట్లు వృథా అయితే నీళ్లు ఎట్ల వస్తున్నయని నిలదీశారు. ఒక్క ఏడో బ్లాక్ తప్ప, మిగతా అంత బాగుందన్నారు. తొందరగా మేడిగడ్డకు రిపేర్ చేయాలని.. రాజకీయాలు కొద్ది రోజులు పక్కన పెట్టి రైతుల బాగు చూడాలని సూచించారు. వర్షాలు లేకుండా తాగునీరు కూడా దొరకదన్నారు. ఎన్నికల వేళ రాజకీయాలు చేసుకుందామన్నారు. ఎన్‌డీఎస్ఏ నివేదికలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం తప్పుపట్టిందని చెప్పారు. బ్లాక్ 7 తిరిగి కట్టడం ద్వారా మేడిగడ్డను ఉపయోగంలోకి తీసుకురావచ్చని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. ఖర్చు చేసింది రూ.90వేల కోట్లయితే, లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఉత్తమ్ అంటున్నారని పేర్కొన్నారు. ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తమన్నరని, కనీసం ఆరు వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు మీద క్యాబినెట్‌లో కాకుంటే ఏఐసీసీలో చర్చించండని.. తాము భయపడేది లేదని అన్నారు. తమ్మిడిహెట్టి కడుతామని చెప్పి 17 నెలలైనా తట్టెడు మట్టి తీయలేదన్నారు. ఈ సమావేశంలో మాజీమంత్రి సునీత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story