- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను బీఆర్ఎస్ తాకట్టు పెట్టింది: జూపల్లి
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేస్తామంటున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులకు ఆ నైతిక హక్కు లేదని ఆయన మండిపడ్డారు. (MCRHRD) ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం సీఎల్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు వంశీ కృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పాలమూరుకు అత్యధిక నిధులు కేటాయించాలని సీఎంని కోరామని, ఆ ప్రాజెక్టు తోపాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, లక్ష్మీదేవిపల్లి గుట్టకు నీళ్లు తీసుకెళ్తామని సీఎం చెప్పారని మంత్రి జూపల్లి వెల్లడించారు. 2015లో భూత్పూర్‌లో రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారని, పంపులు, మోటార్లు, తదితర వాటి కోసం రూ. 35 వేల కోట్లు కేటాయించినా, పదేళ్లలో కేవలం రూ. 25 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన విమర్శించారు. మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్లకు కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదని, పాలమూరు–రంగారెడ్డి పూర్తి కావాలంటే లక్ష కోట్ల రూపాయలు కావొచ్చన్నారని మంత్రి జూపల్లి తెలిపారు.
కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు
కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ హయాంలోనే రూ. 8500 కోట్లు ఖర్చు చేశామని, బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ. 6300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆయన చెప్పారు. తుమ్మిడి హట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉందని, గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావచ్చని, మల్లన్న సాగర్‌ను 50 టీఎంసీలతో నిర్మించారని, మహబూబ్‌నగర్ జిల్లాలో అలాంటి రిజర్వాయర్లు ఎందుకు నిర్మించలేదని మంత్రి ప్రశ్నించారు. జూరాల రిజర్వాయర్ కెపాసిటీ కేవలం 6 టీఎంసీలు మాత్రమే అని, పదేళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అలంపూర్‌లో ఆర్డీఎస్, మల్లమ్మకుంట, తుమ్మిళ్ల వద్ద రిజర్వాయర్లు నిర్మిస్తామని చెప్పి అమలు చేయలేదని, పాలమూరు–రంగారెడ్డికి 90 టీఎంసీల నీటి కేటాయింపులను బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించలేకపోయిందని, తమ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకి త్వరలోనే నీటి కేటాయింపులు 90 టీఎంసీల నికర జలాలు సాధించి తీరుతుందని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను బీఆర్ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, తెలంగాణకు 299 టీఎంసీలు చాలంటూ కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేశారని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం కృష్ణా జలాల్లో తెలంగాణకు 62 శాతం వాటాపై హక్కు ఉందని వాదిస్తోందని, పాలమూరుపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించారని మంత్రి విమర్శించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ వేల టీఎంసీల నీళ్లు తీసుకెళ్లిందని మంత్రి ఆరోపించారు. 16 టీఎంసీలతో 47 రిజర్వాయర్లను ప్రతిపాదించారని, భూసేకరణ లేకుండా ఎలా నిర్మిస్తారని, బటన్ నొక్కగానే నీళ్లు వస్తాయి అని చెప్పడం వారి అవగాహన లేమికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. మొదటి పంప్ నుంచి రెండో పంప్ వరకు లింక్ కూడా పూర్తి కాలేదని, కెనాల్స్‌కు ఇప్పటికీ అనుమతులు రాలేదని మంత్రి జూపల్లి చెప్పారు.
కాళేశ్వరం ఎలా పూర్తి చేశారు? : మంత్రి వాకిటి శ్రీహరి
పాలమూరు ప్రజలను అమాయకులుగా బీఆర్ఎస్ భావిస్తోందని, పాలమూరు తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం ఎలా పూర్తి చేశారని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. ఒక్క మోటార్ బటన్ నొక్కితే ప్రాజెక్టు పూర్తైనట్లా?, 21 ప్యాకేజీల్లో 18 మాత్రమే చేపట్టి, మూడింటిని పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. అంచనా వ్యయంలో సగం కూడా ఖర్చు పెట్టలేదని, పాలమూరుకు నిధులు ఇవ్వకపోతే అప్పటి మంత్రులు కేసీఆర్‌ను ఎందుకు నిలదీయలేదని మంత్రి వాకిటి శ్రీహరి ప్రశ్నించారు. పాలమూరు కింద ఒక్క ఎకరానికి అయినా నీళ్లు ఇచ్చారా అని ఆయన నిలదీశారు. సంగెం బండ వద్ద పనులు పూర్తి చేయలేకపోయారని, తమ ప్రభుత్వం సంగెం బండ ద్వారా 22 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తోందని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు పాలమూరు ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించారని, పాలమూరు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టిందని మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ పోరు బాట కాదుపొర్లు దండాలు పెట్టినా ప్రజలు మిమ్ములను నమ్మే పరిస్థితి లేదని వాకిటి శ్రీహరి మండిపడ్డారు. కృష్ణా నది ప్రారంభం తమ మక్తల్ లోనే అని, పక్కన ఉన్న 12 కిలోమీటర్ల నుంచి తెచ్చే నీటిని 300 కిలోమీటర్ లు తిప్పి తెస్తామని చెప్పారని విమర్శించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది కేసీఆర్
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, నీళ్లను పదవుల కోసం తాకట్టు పెట్టింది కేసీఆర్ అని, తెలంగాణకు ఇప్పుడు రక్షణ కవచంగా నిలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పాలమూరు ప్రాజెక్టును తామే బొందపెట్టి ఇప్పుడు అదే ప్రాజెక్టు పేరుతో ప్రజల్లోకి వచ్చి మేమింకా రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాయమాటలు, మోసాలను మహబూబ్‌నగర్ ప్రజలు నమ్మరని, అందుకే ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించి స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. పార్లమెంట్‌లో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.






