'బీఆర్ఎస్ ఇక్కడ పీకిందేమి లేదు.. కౌశిక్ రెడ్డి ఓ రౌడీ షీటర్!'

by Disha Web Desk 4 |
బీఆర్ఎస్ ఇక్కడ పీకిందేమి లేదు.. కౌశిక్ రెడ్డి ఓ రౌడీ షీటర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై బీజేపీ మహిళా నేత, సినీ నటి జీవిత రాజశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి ఓ రౌడీ షీటర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అతడికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదని స్వయంగా మా బంధువుల విషయంలోనే అతడు పరుషంగా మాట్లాడి చివరకు సారీ చెప్పి వెనక్కి తగ్గాడని అన్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంటంలో బీజేపీ నిర్వహించిన ప్రజా గోస బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ సభకు జీవిత రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఇన్‌డైరెక్ట్‌గా కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తున్నాడని కానీ కౌశిక్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదన్నారు. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలుసని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో పీకింది ఏమిటి అంటే ఒక్కడూ సమాధానం చెప్పరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఉద్దరించనోళ్లు బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు.


Next Story