బీఆర్ఎస్‌లో కొత్త ఊపు.. ఆ ఓటర్లు సైతం కారు వెంటే..!

by Gantepaka Srikanth |

ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఊహించని విధంగా ఫలితాలు రావడం.. మున్సిపాలిటీల్లోనూ చెప్పుకోదగిన స్థానాలను కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఊపు కనిపిస్తున్నది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీని పట్టణ ప్రజలు ఆదరించారు.

బీఆర్ఎస్‌లో కొత్త ఊపు.. ఆ ఓటర్లు సైతం కారు వెంటే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఊహించని విధంగా ఫలితాలు రావడం.. మున్సిపాలిటీల్లోనూ చెప్పుకోదగిన స్థానాలను కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీలో కొత్త ఊపు కనిపిస్తున్నది. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీని పట్టణ ప్రజలు ఆదరించారు. దీంతో ఇప్పుడు పార్టీ రాబోయే గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయంగా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ హైదరాబాద్‌పై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించేందుకు సిద్ధమైంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వచ్చిన పాజిటివ్ సంకేతాలు గులాబీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ఈ ఊపుతోనే జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో పార్టీ ప్లాన్ చేస్తున్నది. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. పట్టణ విస్తరణ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లోనూ తమ ఓటు బ్యాంక్ గణనీయంగా నిలకడగా ఉండటం నాయకత్వానికి ధైర్యం ఇచ్చినట్లయింది.

ఆంధ్రా ఓటర్లు బీఆర్ఎస్‌కు జై!

నగర పరిసరాల్లో మధ్యతరగతి, ఐటీ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, కొత్తగా స్థిరపడిన కుటుంబాలతో పాటు ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లు సైతం ఉన్నారు. అలాంటి మిశ్రమ వాతావరణంలోనూ బీఆర్ఎస్‌కు మద్దతు లభించిం ది. అయితే.. ఈ మద్దతు ఎప్పటి నుంచో బీఆర్ఎస్‌కు ఉన్నప్పటికీ.. అది ఈ ఎన్నికల్లోనూ కొనసాగిందని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లు సైతం గులాబీ పార్టీకే జై కొట్టారన్న టాక్ నడుస్తున్నది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా విభజించారు. దాంతో ఈ మూడు కార్పొరేషన్లపైనా గులాబీ జెండా ఎగరవేస్తామని పార్టీ భరోసాతో ఉన్నది.

Next Story