ధరణి ముసుగులో బీఆర్ఎస్ దోపిడీ : జీపీవోల కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి

by Muthe.Rajitha |

తెలంగాణ సాధనలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకమైనది. మారుమూల పల్లెల్లో తెలంగాణ భావ వ్యాప్తికి తోడ్పాటునందించారు.

ధరణి ముసుగులో బీఆర్ఎస్ దోపిడీ : జీపీవోల కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/శేరిలింగంపల్లి : తెలంగాణ సాధనలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర కీలకమైనది. మారుమూల పల్లెల్లో తెలంగాణ భావ వ్యాప్తికి తోడ్పాటునందించారు. క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో భాగమయ్యారు. మొదటి సీఎం కేసీఆర్ ఉద్యమంలో పాల్గొన్న వారందరి ప్రతిష్టను పెంచుతారని అనుకున్నాం. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సింగరేణి కార్మికులు, పంచాయత్ రాజ్ సిబ్బంది అతీతం కాదు. రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా చిత్రీకరించారు. ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైటెక్ సిటీలో గురువారం రాత్రి జీపీవోలుగా ఎంపికైన 5 వేల మందికి నియామకపు పత్రాలు అందించే కొలువుల పండుగ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూమికి, తెలంగాణకు విడదీయరాని సంబంధం ఉంది.

తెలంగాణలో పోరాటాలన్నీ భూమి చుట్టూనే తిరిగాయి. సాయుధ రైతాంగ పోరాటం భూమి, భుక్తి కోసం చేశారు. కథలు కథలుగా చెప్పుకుంటారు. సమైక్య రాష్ట్రంలో మన భూములను చెరబడుతున్నారన్న ఉద్దేశ్యంతోనే పోరాటం వచ్చింది. ప్రతి పోరాటం వెనుక భూమి ఉంది. వెదిరే రామచంద్రారెడ్డి వంటి భూస్వాములు భూమిని దానం చేసి భూదానోద్యమానికి నాంది పలికారు. నక్సల్బరీ ఉద్యమంలో దున్నే వాడిదే భూమి అంటే అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు అగ్రికల్చర్ సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ భూమిని తీసుకొని పేదలకు అసైన్ చేశారు. 25 లక్షల ఎకరాల భూమిని పంచారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆదివాసీలకు 10 లక్షల ఎకరాలు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. తల్లికి, బిడ్డకు ఉన్న సంబంధమే భూమి, తెలంగాణకు ఉంది.

ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ సాధన తర్వాత ధరణి అనే భూతాన్ని తీసుకొచ్చారు. వారి భూదాహం తీర్చుకునేందుకు అమలు చేశారు. వాళ్ల దోపిడీని తెలయకుండా చేసేందుకే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. వాళ్ల దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం నిలదీస్తుందన్న భయంతోనే వీఆర్వోలను తొలగించారు. దోపిడీకి అడ్డుగా ఉన్న ఈ వ్యవస్థలోని ఉద్యోగులను వీఆర్వో, వీఆర్ఏలను రైతుల భూములను గుంజుకుంటున్నారని నిందలు వేశారన్నారు. చెట్టుకొకరిని, పుట్టకొకరినీ పడేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరిని కదిలించినా..

తాను పాద యాత్ర చేసేటప్పుడు ఎవరిని కదిలించినా ధరణి ఓ భూతంగా మారిందని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే రాహుల్ గాంధీతో చెప్పించాను. సీడబ్ల్యూసీలో చర్చించాం. ధరణిని బంగాళాఖాతంలో విసిరేస్తామన్నాం. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డిని రెవెన్యూ శాఖను అప్పగించామన్నారు. నిష్ణాతులతో నిపుణుల కమిటీని వేశాం. భూ భారతి 2‌‌025 చట్టాన్ని తీసుకొచ్చాం. ధరణితో పట్టుకున్న ధరిద్రాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే వీఆర్వో, వీఆర్ఏలను దూరం చేశారు. గంపగుత్తగా కలెక్టర్లకు అప్పగించారు. సమస్యలు పరిష్కారం కావు. దాంతో తహశీల్దార్ ని తగులబెట్టే ఉదంతాలు జరిగాయి. సిరిసిల్ల, ఇబ్రహింపట్నం లో ఎన్నో జరిగాయి.

లంచాలు ఇచ్చుకోలేమని ఓ మహిళ తన తాళి బొట్టును గుమ్మానికి వేలాడదీసిన ఉదాహారణలు ఉన్నాయి. ఆనాటి పాలకుల అందించిన వైరస్ ధరణి. అందుకే జీపీవోలు వచ్చిన తర్వాత దోపిడీ లెక్కలు తీయాలి. పేద రైతులకు వారధిగా ఉండాలని గ్రామ పాలనాధికారులను తీసుకొస్తున్నాం. 1.56 కోట్ల ఎకరాల భూముల రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేస్తామన్నారు. గతంలో చోటు చేసుకున్న తప్పిదాలను సరి చేసే బాధ్యత జీపీవోల మీద ఉంది. పేదలకు న్యాయం జరగాలంటే గ్రామ స్థాయిలో ఉద్యోగులు ఉండాలి.

సాదాబైనామాలకు మోక్షం

త్వరలో 9 లక్షల సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన జరగాలని సీఎం అన్నారు. ఏ సమాజంలోనైనా, ఎంత గొప్ప వ్యవస్థలోనైనా 5 శాతం చెడ్డ వాళ్లు ఉంటారు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి. వీఆర్వోలు, వీఆర్ఏలు, తహశీల్దార్లు తప్పులు చేస్తే చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప సొంతింటిని తగులబెట్టుకోవడం సరైంది కాదు. అలాగే వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థల రద్దు అలాగే జరిగిందన్నారు. 20 నెలల పాలనలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. వీఆర్వో, వీఆర్ఏలు లేని లోటు ప్రభుత్వ పథకాల అమలులో కనిపించిందన్నారు.

వీఆర్వో, వీఆర్ఏలపై దుర్మార్గులని ముద్ర వేశారు. అలాంటి వ్యవస్థను తిరిగి తీసుకొస్తే మళ్లీ చెడ్డ పేరు వస్తుందని మంత్రివర్గ సహచరులు అన్నారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి ఆ పార్టీని రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. లక్ష కోట్లు ఖర్చు పెడితే కట్టడం, కూలగొట్టడం జరిగిపోయింది. ఇప్పుడు గ్రామ గ్రామాన ఆ పార్టీని ప్రజలే అడుగుతారు. ఎంతో వ్యతిరేకతను కల్పించినా వీఆర్వోలు గ్రామాల్లో తిరిగి జీపీవోలుగా పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తారన్నారు.

చెడ్డపేరు రాకుండా చూడండి

ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తూ భూ భారతి చట్టాన్ని అమలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించి న్యాయం చేయాలన్నారు. ఈ భూమితో చెలగాటం ఆడినోళ్లు, ధరణితో చెలగాటమాడినోళ్లకు ఒకటే గతి పడుతుందన్నారు. ధరణి ముసుగులో దోపిడీ చేయడం వల్లే వారికి ప్రజలే శిక్ష అమలు చేశారన్నారు. సమాజం ముందు దోషులుగా నిలబెట్టేందుకు వారి పేపర్లు, టీవీలను అడ్డం పెట్టుకున్నారన్నారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజల మెదడులో నాటేటట్లు చేశారన్నారు. అందుకే సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నారు. అవినీతి ముద్రను తొలగించాలని జీపీవోలకు పిలుపునిచ్చారు. ధరణి ముసుగులో చేసిన దోపిడీని ప్రజలకు వివరించాలన్నారు. రెవెన్యూ శాఖ మీద పడిన చెడు ముద్ర పోయేటట్లుగా గ్రామాల్లో పని చేయాలన్నారు. మీ మీద పడిన మచ్చను తొలగించుకోవాలని, ఆ మేరకు నిరూపించుకోవాలని జీపీవోలను సూచించారు.

ఆదర్శంగా ఉండేలా భూభార‌తి : మంత్రి పొంగులేటి

గ‌త ప్రభుత్వం 2020 ఆర్వోఆర్ చ‌ట్టం, ధ‌ర‌ణి పోర్టల్ వల్ల తెలంగాణ స‌మాజం తీవ్రంగా న‌ష్టపోయింద‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. అందువ‌ల్లే ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో క‌లిపేసి భూభార‌తి చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చామ‌ని, దీని రూప‌క‌ల్పన స‌మ‌యంలో సీఎం రేవంత్ రెడ్డిని సుమారు 36-37 గంట‌ల‌కు పైగా ప‌లుమార్లు విసిగించి ఆయ‌న స‌ల‌హాల‌తో మ‌రీ తీసుకువ‌చ్చామ‌ని వివ‌రించారు. భూ భార‌తిని తొలుత 4 మండ‌లాల్లోని 4 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకువ‌చ్చామ‌ని త‌ర్వాత 32 మండ‌లాల్లోనూ, జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజ‌ల‌కు అందించామ‌ని వివ‌రించారు. ఎవ‌రి నుంచి ఒక్క రూపాయికూడా తీసుకోకుండా 8.65 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు తీసుకున్నామ‌ని తెలిపారు. గ‌త ప్రభుత్వంలో సాదాబైనామాల‌పై సుమారు 9.26 ల‌క్షల ద‌ర‌ఖాస్తుల‌కు మోక్షం క‌ల‌గ‌లేద‌ని, పైగా కోర్టుల‌లో కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు.

తాజా నిర్వహించిన స‌ద‌స్సుల‌లో సుమారు 8.65 ల‌క్షల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌న్నారు. వారం రోజుల క్రితం కోర్టులో సాదాబైనామాల‌పై స్టేను తొలగించేలా ప్రయ‌త్నించి స‌ఫ‌ల మ‌య్యామ‌ని తెలిపారు. గతంలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు, ప్రస్తుత తాజా ద‌ర‌ఖాస్తుల‌న్నింటినీ సాధ్యమైనంత త్వరగా ప‌రిష్కరిస్తామ‌ని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 6860 క్లస్టర్‌ల‌ను ఏర్పాటు చేసి 10,954 రెవెన్యూ గ్రామాల‌లో గ్రామ‌ప‌రిపాల‌నాధికారుల నియామ‌కం చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. స‌ర్వేయ‌ర్ల నియామ‌కం ద్వారా భూ స‌మస్యల‌కు చెక్ పెడ‌తామ‌న్నారు. 318 మంది స‌ర్వేయ‌ర్లుకు అద‌నంగా 800 మందిని నియమించ‌డ‌మే గాక 7000 మంది లైసెన్స్‌డ్ స‌ర్వేయ‌ర్లను వ‌చ్చే ఉగాదిలోగా భ‌ర్తీ చేస్తామ‌ని ప్రక‌టించారు.

అంతేగాక సుమారు 3 ద‌శాబ్దాలుగా వివిధ ప్రాజెక్ట్ ల‌కు జ‌రిగిన భూ సేక‌ర‌ణలో ఇంకా రైతుల పేర్లు పహనీల్లో ఉండిపోయాయ‌ని, ఈ స‌మ‌స్యను కూడా ప‌రిష్కరిస్తామ‌న్నారు. ప్రతి సంవ‌త్సరం డిసెంబ‌ర్ 31వ తేదీనాటికి అన్ని గ్రామాల వారీగా జ‌మాబందీ మేర‌కు అప్పటి వ‌ర‌కు జ‌రిగిన క్రయవిక్రయాల‌ను హ‌క్కుల‌ను వివ‌రించేలా ప్రక‌ట‌న జారీ చేస్తామ‌న్నారు. దీని హార్డ్‌ కాపీలు ప్రతి రెవెన్యూ గ్రామంలో అందుబాటులో ఉంచుతామ‌న్నారు. ఇక‌పై ప్రభుత్వానికి మాట‌, మ‌చ్చ రాకుండా ప‌నిచేయాల్సిన బాధ్యత రెవెన్యూ కుటుంబ స‌భ్యుల‌దేన‌ని చెబుతూ ఉన్నత సేవ‌లు అందిస్తామంటూ మంత్రి ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. తనతో పాటు మీరు, మీతో పాటు నేను ప్రజ‌ల‌కు మరిన్ని మంచి సేవ‌లు అందిద్దామ‌న్నారు. అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా భూ భారతి చట్టం తయారు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ధరణి స్థానంలో అద్భుతమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ఈ చట్టం చేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడిపారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ధరణి చట్టానికి విధివిధానాలు రూపొందించలేదని కానీ మేమొచ్చాక పేదవాడి భూములకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ధరణి ద్వారా ఏర్పడిన సమస్యలను గత ప్రభుత్వం పరిష్కరించలేదని మా ప్రభుత్వంలో అధికారులే ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. చెప్పిన మాట వినలేదని గత ప్రభుత్వాధినేత గ్రామ రెవెన్యూ వ్యవస్థను రోడ్డున పడేసిందని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రిలు సీతక్క, సీసీఎల్ఏ లోకేష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Next Story