టార్గెట్ మంత్రి పొంగులేటి.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

by Gantepaka Srikanth |

తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఉద్రిక్తతకు దారితీశాయి.

టార్గెట్ మంత్రి పొంగులేటి.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఉద్రిక్తతకు దారితీశాయి. అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన 'రాఘవ కన్‌స్ట్రక్షన్స్' వ్యవహారం సభలో పెను దుమారం రేపింది. బీఆర్ఎస్ సభ్యులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో జరుగుతున్న అక్రమాలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. స్పీకర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వంపై నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.

హౌస్ కమిటీ వేయాలి..

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ చేపడుతున్న పనులు, మైనింగ్ అక్రమాలు మరియు టెండర్లలో జరుగుతున్న అవకతవకలపై తక్షణమే హౌస్ కమిటీ (House Committee) వేయాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తన సొంత సంస్థకు లబ్ధి చేకూరుస్తున్నారని, దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యుల తీరుపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. గందరగోళం మధ్యే సభను అదుపులోకి తెచ్చేందుకు స్పీకర్ ప్రయత్నించినప్పటికీ, సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఆరోపణలను గతంలోనే తోసిపుచ్చినప్పటికీ, ప్రతిపక్షం మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. ఈ నిరసన నేపథ్యంలో సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

Next Story