రాష్ట్ర ఎన్నికల సంఘమా?.. రేవంత్‌ ఎన్నికల సంఘమా?

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. దౌర్జనాలపై దిగిందని బీఆర్ఎస్ నేతలు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర ఎన్నికల సంఘమా?.. రేవంత్‌ ఎన్నికల సంఘమా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ నిస్సిగ్గుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. దౌర్జనాలపై దిగిందని బీఆర్ఎస్ నేతలు బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు నోట్ విడుదల చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టారని.. కొల్లాపూర్, రామాయంపేట, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో ఇష్టానుసారంగా ఓటర్లను భయపెట్టారని ఆరోపించారు. రెండు రోజులుగా అనేక ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘమా? రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘమా? అని ప్రశ్నించారు. మంత్రులే కాన్వాయ్ వేసుకొని వెళ్లి ఓట్లు వేయించారని.. డబ్బు మద్యం పంపిణీ చేసి కాంగ్రెస్ గెలవాలని చూశారని పేర్కొన్నారు. అయినా.. ఎన్నికల సంఘం కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. తమ వారిని కిడ్నాప్‌లు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, సదానందం, కిరణ్‌గౌడ్, ఫయాజుద్దీన్ పాల్గొన్నారు.

Next Story