BRS: కమిటీల నియామకంపై బీఆర్ఎస్ గప్‌చుప్..! ఏళ్లుగా కొత్త వారికి నో ఛాన్స్

by Kema Shiva Kumar |

పదేండ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్.. కమిటీల ఏర్పాటుపై కాలయాపన చేస్తున్నది.

BRS: కమిటీల నియామకంపై బీఆర్ఎస్ గప్‌చుప్..! ఏళ్లుగా కొత్త వారికి నో ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేండ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్.. కమిటీల ఏర్పాటుపై కాలయాపన చేస్తున్నది. పార్టీ రాష్ట్ర కమిటీని ఎనిమిదేండ్ల క్రితం నియమించింది. అప్పటి నుంచి మళ్లీ కమిటీలను వేయలేదు. జిల్లాల్లో కేవలం అధ్యక్షుల వరకే నియామకం చేపట్టి మిగతా కార్యవర్గాన్ని ప్రకటించలేదు. ఇన్నాళ్లూ ఏక వ్యక్తి కమిటీల తరహాలోనే ఉన్నాయి. కొత్త కమిటీల ఏర్పాటుపై పార్టీ పెద్దలు అంతగా దృష్టి సారించడం లేదు. ఫలితంగా.. రోజురోజుకూ కేడర్‌లో నిరాశ పెరుగుతున్నది. కొందరు పార్టీని సైతం వీడుతున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేద్దామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించినా.. దానికి ఇంకా ఎంత సమయం పడుతుందోననే అనుమానాలు శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఉద్యమం నుంచి రాజకీయ పార్టీగా..

తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ (ఇప్పుడు బీఆర్ఎస్) 2001లో ఆవిర్భవించింది. ఉద్యమ పార్టీగా మొదలై.. రాజకీయ పార్టీగా మారిపోయింది. అప్పటి నుంచి కేసీఆరే ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఇటు పార్టీ బాధ్యతలనూ ఆయనే నిర్వర్తించారు. గతంలో ఏడాదికోసారి పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేసే వారు. అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించినా.. నామినేటెడ్‌లా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చూశాం. మిగితా కార్యవర్గాన్ని నామమాత్రంగా నియమించే వారు. 2014కు ముందు గులాబీ పార్టీ సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించింది. ఎప్పడికప్పుడు పార్టీని నమ్ముకున్న వారికి పదవులు కేటాయిస్తూ వచ్చింది. నిత్యం వారిపై పర్యవేక్షణ సైతం ఉండేది. అటు జిల్లా కమిటీలపైనా సరైన కసరత్తు చేసి హోదాకు న్యాయం చేసే వారిని నియమించింది. ఎప్పుడైతే పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి జిల్లా కమిటీలపై పర్యవేక్షణ పూర్తిగా వదిలేసింది. కేవలం స్థానికంగా ఉన్న పార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి.. అధిష్టానం సైడ్ అయిపోయింది. ఇక ఆ సమయంలో ఎమ్మెల్యేలు తమకు నచ్చిన వారికి.. తమకు అనుకూలంగా ఉండే వారికే పదవులు ఇచ్చినట్టు చాలా ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్ర స్థాయిలోనూ కార్యవర్గం లేదు..

2017 పార్టీ అధిష్టానం అప్పటి టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రకటించిన కార్యవర్గమే ఇప్పటికీ కొనసాగుతున్నది. పార్టీ బీఆర్ఎస్‌గా మారినప్పటికీ కొత్త కార్యవర్గాన్ని ఇంతవరకూ ప్రకటించలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి కార్యవర్గాలపై కార్యకర్తలు, నాయకులు పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. అప్పటి నుంచి తమకేదైనా పదవి వస్తుందా.. రాష్ట్ర స్థాయిలో ఏదైనా హోదా దక్కుతుందా అని చాలా మంది కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 2, 2021లో సంస్థాగత ఎన్నికలు జరిపింది. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకూ 15 మంది సభ్యులతో కూడిన గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. అలాగే.. గ్రామాల్లోని విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక తదితర పార్టీకి అనుబంధాలైన 14 సంఘాలను నియమించింది. ఇక.. అదేనెల 13 నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయిలో కమిటీలను వేసింది. 2022 జనవరి 26న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కార్యవర్గాలను, అనుబంధ కమిటీలను నియమించలేదు.

కేడర్, లీడర్ల ఎదురుచూపులు..

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నప్పటి నుంచి ఇంతవరకు కార్యవర్గాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసింది లేదు. పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అరంగేట్రం చేశారు. దాంతో సంస్థాగత పదవులపై బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు. కానీ.. 2022 జనవరి 26న అధిష్టానం 33 జిల్లాలకు అధ్యక్షులను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకున్నది. అప్పటి నుంచి జిల్లా, పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటించింది లేదు. నాలుగేళ్లుగా కార్యకర్తలు పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. పార్టీని నమ్ముకొని ఉన్న నాయకుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. పార్టీని నమ్ముకొని ఉన్న వారికి అన్యాయం జరుగుతూనే ఉన్నదని చాలా వరకు కేడర్ బహిరంగంగానే కామెంట్స్ చేస్తుండడం గమనార్హం. పార్టీ కోసం కష్టపడి రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందనే అసంతృప్తి వారిలో ఉంది. మరోవైపు.. రాష్ట్రంలో పార్టీ అధికారం కోల్పోయి ఏడాది గడిచిపోయింది. ఇప్పటికి కూడా కేసీఆర్ కానీ.. కేటీఆర్ కానీ పూర్తిస్థాయి కార్యవర్గాలు, కమిటీలపై దృష్టి సారించడం లేదన్న టాక్ ఉంది. సభ్యత్వ నమోదు జరగలేదు. ఇటీవల బీఆర్ఎస్‌వీ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణకు హాజరైన కేటీఆర్ విద్యార్థి విభాగం కమిటీలను త్వరలోనే నియమించుకుందాం అని ప్రకటించడం విశేషం.

Next Story