- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS: అసెంబ్లీ సమావేశాలపై బీఆర్ఎస్ ఫోకస్.. సర్కార్ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్లాన్
అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ అధిష్టానం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఏడాదిలో కాంగ్రెస్ ఏం అమలు చేసింది.. ఇచ్చిన హామీలు ఎన్ని..ఇప్పటివరకు ఎన్ని అమలు చేసింది..ఇంకా ఎన్ని ఉన్నాయి.. 6 గ్యారెంటీల్లోనూ ఎన్ని అమలు చేసిందనే అంశాలపై ఆరా తీస్తుంది. ప్రతీ అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టేందుకు సిద్ధమవుతుంది. అందుకు పార్టీ సీనియర్ నేతలతోనూ సుధీర్భంగా చర్చిస్తున్నది. ఏడాదిగా విఫలమైన అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని భావిస్తుంది.
మీడియా ముందు, ప్రజాక్షేత్రంలో వెళ్లడానికంటే అసెంబ్లీలోనే విమర్శలు చేస్తే ప్రజల్లోకి బాగా వెళ్తుందని, పార్టీకి సైతం మైలేజ్ వస్తుందని, ప్రజల్లోనూ పార్టీకి ఆదరణ పెరుగుతుందని భావిస్తోంది. అందుకే కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సబ్బండ వర్గాలకు చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తామన్నారు. లగచర్ల అంశం నుంచి మొదలుకొని రాష్ట్రంలో కొనసాగుతున్న ఆత్మహత్యలు, ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలులో వైఫల్యం, వ్యవసాయ రంగ సంక్షేమాన్ని బట్టి ప్రతీ అంశం, ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ప్రకటించారు.
ఫాంహౌస్‌లో కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ..
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో కేటీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. విజయోత్సవాల్లో శాఖల వారీగా ఏం చెబుతున్నారు.. సాధించిన అంశాలు ఏమిటి.. విస్మరించిన వాటిపైనా చర్చించినట్లు తెలిసింది. రేవంత్ ధోరణిపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. వ్యవసాయం, ఉద్యోగ నియామకాలు, విద్యుత్, నిరుద్యోగుల సమస్య, రైతుల రుణమాఫీ, భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2,500 తదితర అంశాలపైనా చర్చించినట్లు టాక్. ఇక జూబ్లీహిల్స్ పీఎస్ ఘటన, ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డిపై కేసు, హరీశ్ రావు, నేతల అరెస్టు అంశాలపైనా చర్చించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, గ్యారెంటీలు, హామీలు, గురుకుల విద్యావ్యవస్థ, శాంతిభద్రతలపైనా నిలదీయాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ప్రభుత్వ వైఫల్యాలే తమకు కలిసి వస్తాయని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.
8న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో..
అసెంబ్లీలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ కానున్నారు. ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఈనెల 8న మధ్యాహ్నం 1 గంటకు సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సమావేశానికి అందరూ హాజరుకావాలని సమాచారం పాస్ చేశారు. ఫాంహౌజ్‌లో ఈ భేటీ నిర్వహించడం తొలిసారి. పార్టీ ఫిరాయింపులు, పార్టీ మారిన వారికి పదవులు తదితర అంశాలతో పార్టీ మారే ఆలోచన ఉన్నవారికి పార్టీ తరపున భరోసా కల్పించనున్నట్లు తెలిసింది.






