మొన్నటి వరకు మౌనం… ఇప్పుడు రేవంత్‌ పై టార్గెట్.. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ ఆరోపణల వెనక గేమ్ ప్లాన్ ఇదేనా?

by Prasad Jukanti |   (  Updated:2025-07-25 15:21:43  IST  )

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతల తీరు సంచలనంగా మారింది.

మొన్నటి వరకు మౌనం… ఇప్పుడు రేవంత్‌ పై టార్గెట్.. ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ ఆరోపణల వెనక గేమ్ ప్లాన్ ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారం పొలిటికల్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యాయనే అంశంలో ఓ వైపు సిట్ దర్యాప్తు కొనసాగుతుండగా ఇంతలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని బీఆర్ఎస్ (BRS) ఆరోపించడం సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అయితే నిన్నా మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాట్లాడేందుకు వెనకా ముందు ఆలోచించిన గులాబీ లీడర్లు అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చి వరుసగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడుతుండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మొన్నటి వరకు నో కామెంట్స్..:

గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ల ట్యాపింగ్ బాగోతంపై సిట్ దర్యాప్తులో కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. అధికారం అడ్డం పెట్టుకుని వేలాది మంది అమాయకుల ఫోన్లును ఇష్టారాజ్యంగా గత పాలకులు, అధికారులు ట్యాప్ కు పాల్పడినట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన పలువురు పోలీసు అధికారులు అరెస్టు కావడం అనేక మందిని సిట్ దర్యాప్తుకు పిలుస్తుండటం ఏపూటకు ఏం జరుగనుందనే ఉత్కంఠ నెలకుని ఉంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు ఈ కేసులో సైలెంట్ మోడ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతలు గత రెండు వారాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఎదురుదాడికి దిగుతుండటం సంచలనంగా మారింది. సీఎం స్వయంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని గులాబీ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. కేటీఆర్, ఆర్ఎస్పీ ఈ అంశంపై మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని ఏకంగా రాహుల్ గాంధీ ఫోన్ ను మానిటర్ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం తన భార్య ఫోన్ ట్యాప్ చేస్తోందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా ఓ స్టెప్ ముందుకు వేసిన కౌశిక్ రెడ్డి.. 'రేవంత్ రెడ్డి ప్రైవేట్ హ్యాకర్లను పెట్టి హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి.. రాత్రి 2 గంటలకు మై హోమ్ భుజా అపార్ట్ మెంట్ లో ఏ హీరోయిన్ దగ్గరకి పోతున్నావో అందరికీ తెలుసు' అంటూ ఘాటు ఆరోపణలు చేశారు.

బ్లేమ్ పాలిటిక్స్ లో భాగమేనా?:

ఇన్నాళ్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించేందుకు ఆచితూచి వ్యవహరించిన బీఆర్ఎస్ నేతలు వరుసగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని ఆరోపించడం వెనుక మతలబు ఏంటి అనేది ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఇదంతా పక్కాగా బీఆర్ఎస్ ఆడుతున్న బ్లేమ్ గేమ్ పాలిటిక్స్ (Blame politics) అని తమపై వచ్చిన నిందను కాంగ్రెస్ కు అంటించడం ద్వారా తమ హాయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తీవ్రతను తగ్గించడం, లేదా చర్చను పక్క దారి పట్టించే ప్రయత్నమే అనే విమర్శలు కాంగ్రెస్ వైపు నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసుపై మొన్న ఢిల్లీలో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమేనని అయితే నిబంధనలకు లోబడి అన్ని అనుమతులు తీసుకుని చేయాల్సి ఉంటుందని చెబితే దాన్ని కూడా బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆల్ ఆఫ్ సడెన్ గా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఏ పరిణామాలకు దారి తీస్తుందో అనేది ఉత్కంఠగా మారింది.

బీఆర్ఎస్ పై సొంత శ్రేణుల్లో విమర్శలు:

గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ఎత్తుగడ వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన ఆరోపణలపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులే విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు ఈ పనికి రాని స్టేట్మెంట్ లు అని కామెంట్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ పై ఆధారాలు లభించడం, ట్యాపింగ్ కు సంబంధించిన పరికరాలు మూసీ నదిలో దొరకడం అంతా కళ్ల ముందు కనిపిస్తున్నా వీటిని కవర్ చేయడాని ప్రత్యర్థుల వద్ద ఇంత కాలం ఇబ్బంది పడ్డామని ఇప్పుడు అనూహ్యంగా అగ్రనేతలు చేస్తున్న ఆరోపణలుతో బీఆర్ఎస్ కు మేలు కంటే కీడే ఎక్కువ అని విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు ఎంత వరకు నిలబడతారు.. ఈ పరిణామాలను కాంగ్రెస్ ఎలా ఎదుర్కోబోతున్నది అనేది వేచి చూడాలి.

Next Story