- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పల్లెల వైపు చూడని BRS బడా లీడర్లు.. తీవ్ర నిరాశలో పార్టీ లోకల్ కేడర్
ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ.. ఏ స్థాయి ఎన్నికలైనా డబ్బు ప్రవాహం పారాల్సిందే. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నిక సీజన్ నడుస్తున్నది. గ్రామాల్లో నెలకొన్న స్థానిక సందడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే రెండు విడతల్లో నామినేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అయితే.. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను పెద్దగా పట్టించుకోవడం లేదు.
పార్టీల మద్దతుతో అభ్యర్థులు బరిలోకి..
ఈ ఎన్నికలు పార్టీతో ముడిపడి లేకపోయినప్పటికీ.. గ్రామాల్లో మాత్రం పార్టీల మద్దతుతోనే పోటీలో నిలవడం చూస్తుంటాం. ఇప్పుడు కూడా గ్రామాల్లో అదే ధోరణి కనిపిస్తున్నది. కాంగ్రెస్ ప్యానల్ అని.. బీఆర్ఎస్ ప్యానల్.. బీజేపీ ప్యానల్ అని బరిలోకి దిగుతున్నారు. అయితే.. అధికార పార్టీకి సంబంధించి ఆ పార్టీకి చెందిన కీలక నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి పరిస్థితి పూర్తిభిన్నంగా కనిపిస్తున్నది. గ్రామాల్లో బీఆర్ఎస్ తరఫున ప్యానల్ వేసి పోటీలోకి దిగుతున్నా.. వారికి పార్టీ నుంచి సరైన మద్దతు దొరకడం లేదన్న ప్రచారం జరుగుతున్నది.
పైసల కోసమేనా ఈ దూరం..
స్థానిక సంస్థల ఎన్నికలు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. లక్షలు కుమ్మరిస్తే కానీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. అయితే.. ఇన్నాళ్లు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లంతా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సమయంలో వారికి మద్దతుగా నిలవాల్సింది పోయి కీలక నేతలు నియోజకవర్గాల మొఖం చూడడం లేదు. ఎందుకు ఈ పరిస్థితి అంటే.. నియోజకవర్గాలకు, గ్రామాలకు వెళ్తే అభ్యర్థులు ఎక్కడ డబ్బులు అడుగుతారోనని భయపడుతున్నారని టాక్. ఈ ఖర్చు తమకు ఎందుకులే అని ఈ ఎన్నికలను లైట్ తీసుకుంటున్నారన్న వాదన వినిపిస్తున్నది. ఈ ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు.. తదితర కీలక నేతలు అటు వైపు తొంగి చూడటం లేదన్న ప్రచారం జరుగుతున్నది.
మన ఎన్నికల వరకు చూద్దాం
స్థానిక సంస్థల ఎన్నికలను గులాబీ పార్టీ కీలక లీడర్లు పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఖర్చును భరించే పరిస్థితి లేదని వారికి కనీసం మొఖం కూడా చూపించడం లేదు. అయితే.. తమ ఎన్నికల వరకు చూద్దాంలే అన్న వైఖరితో ఆ నేతలంతా ఉన్నారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పైసలు ఖర్చు చేయడం ఎందుకని పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలప్పుడే నియోజకవర్గాలు, గ్రామాల వైపు వెళ్దామని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ వీరినే నమ్ముకొని బరిలోకి దిగిన నేతలను పట్టించుకోనప్పుడు.. ఈ నేతలు పోటీ చేసే సందర్భంలో ఎలా మద్దతుగా ఉంటామన్న ప్రశ్న అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నది.






