బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు

by Taduka Kalyani |

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ బొరుసులాంటి పార్టీలని, ఆ రెండు పార్టీల బంధం వీణా–వాణిలా ఉందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు
X

దిశ, దుబ్బాక: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బొమ్మ బొరుసులాంటి పార్టీలని, ఆ రెండు పార్టీల బంధం వీణా–వాణిలా ఉందని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. గురువారం దుబ్బాకలోని బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు తమ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు నిర్వహిస్తున్న సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని అడ్డుపెట్టి ఆర్టీసీ కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయాలని కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని జీఓ జారీ చేసి, కమిటీ ఏర్పాటు చేసి చివరకు ఆ విషయంలో చర్యలు తీసుకోకుండా అధికారంలో నుంచి దిగిపోయిందని విమర్శించారు. అదే విధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డుకునేందుకు టెంట్లు వేయకుండా, మైకులు వినియోగించకుండా, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుపట్టారు. కేసీఆర్ పాలనలో ఎలా వ్యవహరించారో, నేడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని, వారి మధ్య బంధం బలంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులను రోడ్డుపైకి తీసుకురావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి చేసిన హామీలను గుర్తుచేసుకుని, ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, సమ్మెకు శాశ్వత ముగింపు పలకాలని, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేష్ గౌడ్, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు దోరగల్ల శ్రీకాంత్ యాదవ్, కౌన్సిలర్లు మెరుపుల సాయికుమార్ గౌడ్, కనకరాజు, మండల అధ్యక్షుడు మంద అనిల్ రెడ్డి, అక్బర్‌పేట భూంపల్లి మండల అధ్యక్షుడు దేవా సుధాకర్ రెడ్డి, సుంకోజి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story