BREAKING: లిక్కర్ స్కాం కేసులో ఆధారాలు ఉన్నందుకే కవిత అరెస్ట్: రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: లిక్కర్ స్కాం కేసులో ఆధారాలు ఉన్నందుకే కవిత అరెస్ట్: రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆధారాలు ఉన్నందుకే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆధారాలు లేకుండా ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ వ్యక్తులను అరెస్ట్ చేయబోదని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు బీజేపీని ప్రశ్నించారని గుర్తు చేశారు. తీరా కవిత అరెస్ట్ అయ్యాక, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌‌ను అరెస్ట్ చేస్తే.. ఆ అరెస్ట్ పూర్తిగా అప్రజాస్వామ్యం అంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నాడని ఆరోపించారు. ఇది ఎవరితో ఎవరికి ఉన్న అనుబంధమో ప్రజలు రానున్న ఎన్నికల్లో తేలుస్తారని అన్నారు.

బీఆర్ఎస్ ఇప్పటికే తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిందని, లోక్‌సభ ఎన్నికల తరువాత కారు పార్టీతో పాటు కాంగ్రెస్ కూడా కనుమరుగవ్వడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చనందుకు ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు. ఆ పార్టీలో నేటికీ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలే సరిపోయాయని, ఇక పాలనపై ఏం దృష్టి పెడతారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీని దెబ్బకొట్టేందుకు కేసీఆర్, రేవంత్‌‌రెడ్డికి మధ్య లోపాయకారి ఉప్పందం జరిగిందంటూ ఆరోపించారు. అసలు నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి దేశంలో ఏ పార్టీలో లేరని అన్నారు. రాహుల్ గాంధీ ఈ మధ్య చాలా ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఓటమికి కాంగ్రెస్ కారణాలను వెతుకుతూ ఎలక్టోరల్ బాండ్లు, ఈవీఎంలను సాకుగా చూపుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ పక్కా అని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed