- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గజ్వేల్ వార్డుల విభజనకు బ్రేక్.. సీఎం ఆమోదం తర్వాతే చర్యలు
మున్సిపల్ ఎన్నికల కోసం పురపాలక శాఖ అధికారులు అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల కోసం పురపాలక శాఖ అధికారులు అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రేశం మున్సిపాలిటీలతో పాటు ఇస్నాపూర్, గజ్వేల్ మున్సిపాలిటీల్లోనూ వార్డుల విభజన చేయాలని నిర్ణయించారు. కానీ గజ్వేల్ మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రక్రియకు బ్రేక్ పడింది. మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ కావడంతో అధికారులు ఆచితూచి అడుగులేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తర్వాతే చేపట్టే అవకాశముందని సమాచారం. అయితే మిగిలిన జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో వార్డుల విభజన చేయడానికి మున్సిపల్ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వార్డుల విభజన ప్రక్రియను 19 రోజుల్లో పూర్తి చేయనున్నారు.
గజ్వేల్‌లో కొత్త కాలనీలు..
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోనే మల్లన్న సాగర్ బాధితుల కోసం కాలనీలను ఏర్పాటు చేశారు. కానీ గత ప్రభుత్వం వీటిని గ్రామపంచాయతీ కేటగిరిలో పెట్టడంతోపాటు ఎన్నికలు కూడా నిర్వహించింది. పాలకవర్గం గడువు ముగియడంతో అసలు సమస్య ముందుకొచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతాలను గ్రామపంచాయతీ గా పరిగణించడం సరైంది కాదని మున్సిపల్ శాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే వార్డుల విభజన పూర్తిచేసిన గజ్వేల్‌లోనూ కొత్త కాలనీల నేపథ్యంలో వార్డులను పునర్విభజన చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వార్డుల్లోనే ఆయా ప్రాంతాలను కలుపుతూ వార్డులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అధికారులు నిర్ణయించారు. వార్డుల విభజనను సున్నితమైన అంశంగా భావించిన ప్రభుత్వం సీఎం/మున్సిపల్ శాఖ మంత్రి అయినా రేవంత్‌రెడ్డి ఆమోదం తర్వాతనే ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఆ మూడు మున్సిపాలిటీల్లో..
కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో వార్డుల విభజన కార్యక్రమాన్ని చేపట్టడానికి మున్సిపల్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియను 19 రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇంద్రేశం, జిన్నారం కొత్తగా మున్సిపాలిటీలు కావడంతోపాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో శివారు గ్రామాలను విలీనం చేయడంతో అక్కడ కూడా వార్డుల పునర్విభజన చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. వార్డుల విభజనకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.
తేదీ- అంశం
అక్టోబర్ 15 ఫీల్డ్ సర్వే ద్వారా మున్సిపాలిటీ ముసాయిదా ప్రతిపాదనలు
అక్టోబర్ 16 వార్డుల విభజనకు ప్రజల నుంచి సలహాల కోసం నోటీసులు జారీ చేయడం, ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా లెటర్లు రాయడం
అక్టోబర్ 17నుంచి 23 వరకు ప్రజలు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నుంచి సలహాల స్వీకరణ
అక్టోబర్ 24 నుంచి 28 వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సలహాలు, ఫిర్యాదులపై విచారణ
అక్టోబర్ 29 నుంచి 30 వరకు కలెక్టర్ ఆమోదం ప్రతిపాదనలు
అక్టోబర్ 31 సీడీఎంఏకు వార్డుల విభజన రిపోర్టు
నవంబర్ 1 సీడీఎంఏ ద్వారా మున్సిపల్ శాఖకు వార్డుల విభజన రిపోర్టు పంపించడం
నవంబర్ 2 వార్డుల ఫైనల్ నోటిఫికేషన్ జారీ






