Viral Reels: ఇవేం దిక్కుమాలిన రీల్స్..! తల్లిదండ్రులకు వీసీ సజ్జనార్ కీలక సూచనలు

by Ramesh Naini |

ఒడిషాలో ఇటీవల కొంత మంది మైనర్ యువకులు రన్నింగ్ ట్రైన్ ముందు ప్రమాదకరంగా రీల్స్ చేశారు.

Viral Reels: ఇవేం దిక్కుమాలిన రీల్స్..! తల్లిదండ్రులకు వీసీ సజ్జనార్ కీలక సూచనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిషాలో ఇటీవల కొంత మంది మైనర్ యువకులు రన్నింగ్ ట్రైన్ ముందు ప్రమాదకరంగా రీల్స్ చేశారు. ట్రైన్ వచ్చే సమయంలో ఓ బాలుడు రైల్వే పట్టాల మధ్యలో స్లీపర్ల మధ్య పడుకున్నాడు. మరో ఇద్దరు అతన్ని వీడియో తీస్తున్నారు. అప్పుడు రైలు పట్టాల మీద పడుకున్న వ్యక్తి నుంచి రైల్ స్పీడ్‌గా వెళ్లిపోయింది. రైలు వెళ్లిపోగానే.. గట్టిగా అరుస్తూ అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అరుస్తు కేకలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వీసీ సజ్జనార్ (RTC MD VC Sajjanar) పోస్ట్ చేస్తూ.. తల్లిదండ్రులకు కీలక సూచనలు ఇచ్చారు. చిన్నతనం నుంచే (Reels Addiction) రీల్స్ పిచ్చి అనే మానసిక రోగానికి పిల్లలు ఇలా గురైతుండటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా మత్తులో పడి ఫేమస్ అయ్యేందుకు ఎంతటి ప్రమాదకర పనులు చేసేందుకైనా వెనుకాడడం లేదని తెలిపారు.

ఇలాంటి సోషల్ మీడియా (Social media) వ్యసనాన్ని చూస్తూ వదిలేస్తే.. ఎంతో మంది పిల్లలు, యువకుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన పిల్లలకు కౌన్సిలింగ్ అనేది అత్యవసరమని, ఈ వ్యసనం వల్ల జరిగే అనర్థాలను స్పష్టంగా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని, బిజీ లైఫ్ అంటూ పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్దగా ఉండొద్దని సూచించారు. నిర్లక్ష్యంగా ఉంటే మీ పిల్లల జీవితాలను మీరే చేజేతులా నాశనం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు. గుర్తుంచుకోండి.. నష్టం జరిగిన తర్వాత బాధపడితే లాభం ఉండదని తెలిపారు. ముందే మేలుకోండి.. పొంచి ఉన్న సోషల్ మీడియా ముప్పుకు మీ పిల్లలని దూరంగా ఉంచండి.. అని సజ్జనార్ వీడియో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇవేం దిక్కుమాలిన రీల్స్.. ఇలా రీల్స్ చేసే వారిని అరెస్ట్ చేయాలని రైల్వే శాఖకు నెటిజన్లు సూచించారు.

Next Story