లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు

by Ramesh Goud |   (  Updated:2025-02-22 13:47:40  IST  )

లిఫ్టుకు, స్లాబ్‌కు మ‌ధ్య ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు (Hydra DRF Teames) కాపాడాయి.

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు.. కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు
X

దిశ, వెబ్ డెస్క్: లిఫ్టుకు, స్లాబ్‌కు మ‌ధ్య ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు (Hydra DRF Teames) కాపాడాయి. దీనిపై హైడ్రా ప్రత్యేక ట్వీట్ (Hydra Special Tweet) చేసింది. మాస‌బ్ ట్యాంకు (MasabTank), శాంతిన‌గ‌ర్‌ (Shanthi Nagar)లోని మ‌ఫ‌ర్ కంఫ‌ర్టెక్‌ అపార్టుమెంటులో లిఫ్ట్ డోర్ కు గోడ‌కు మ‌ధ్య 6 సంవ‌త్స‌రాల అర్న‌వ్ అనే బాలుడు ఇరుక్కున్నాడు. దీనిపై స్థానిక వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఆర్ఎఫ్ బృంధం రంగంలోకి దిగింది. మ‌ధ్యాహ్నం 2.29 గంట‌ల‌కు ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు స‌మాచారం తెలియగానే డీఆర్ఎఫ్ మొద‌టి బృందం 10నిమిషాల్లో చేరుకుందని హైడ్రా తెలిపింది.

త‌ర్వాత మ‌రో రెండు బృందాలు తోడ‌య్యాయని, గ్రిల్‌తో ఉన్న లిఫ్ట్ డోర్ తెరిచిన వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చే క్ర‌మంలో అంత‌స్తు స్లాబ్‌కు, లిఫ్ట్‌కు మ‌ధ్య ఉన్న గ్యాప్‌ (ఖాళీగా ఉన్న సందులో) లో ప‌డిపోయి కింద‌కు జారి మొద‌టి అంత‌స్తు ద‌గ్గ‌ర ఇరుక్కున్న‌ట్టు నివాసితులు చెప్పారని హైడ్రా వివరించింది. ఇక నాలుగు అంత‌స్తుల అపార్టుమెంట్‌లో మూడో అంత‌స్తులో పిల్ల‌ల‌తో ఆడుకుని లిఫ్టు ఎక్కి జారిప‌డిన‌ట్టు నివాసితులు తెలిపారని, లిఫ్ట్ ఎవ‌రూ ఆప‌రేట్‌చేయ‌కుండా ముందుగా క‌రెంటు క‌నెక్ష‌న్ తొల‌గించామని, ఆ వెంట‌నే డీఆర్ఎఫ్ బృందాలు ఆప‌రేష‌న్ మొద‌లు పెట్టినట్లు తెలిపింది.

గ్యాస్‌క‌ట్ట‌ర్లు, ఫైర్ విభాగానికి చెందిన ప‌నిముట్లుతో లిఫ్టు ఫ్రేమ్‌ను క‌ట్ చేయ‌డంతో పాటు.. స్లాబ్‌ను కూడా అతి క‌ష్టమ్మీద క‌ట్ చేసి బాలుడుని హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడాయని చెప్పింది. స‌రిగ్గా 4.35 గంట‌ల ప్రాంతంలో బ‌య‌ట‌కు తీసి.. త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించి.. త‌ర్వాత ఆసుప‌త్రికి త‌ర‌లించారని తెలిపింది. జిల్లా ఫైర్ ఆఫీస‌ర్ ఎ. య‌జ్ఞ్న‌నారాయ‌ణ‌, స్టేష‌న్ ఫైర్ ఆఫీస‌ర్ పి. ద‌త్తు ఆధ్వ‌ర్యంలో డీఆర్ ఎఫ్ బృందాలు ఈ ఆప‌రేష‌న్‌ను పూర్తి చేశాయని హైడ్రా వివరించింది. ఇక లిఫ్టు ఫ్రేమ్‌లు క‌ట్ చేసి క్లిష్ట‌మైన ఈ ఆప‌రేష‌న్‌ను పూర్తి చేసి.. పిల్లాడిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీయ‌డాన్నిచూసిన స్థానికులు హైడ్రా బృందాల‌ను అభినందించారని హైడ్రా ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

Next Story