కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండూ అవినీతి పార్టీలే : కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

by Muthe.Rajitha |   (  Updated:2025-12-07 17:53:45  IST  )

రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేడా లేదని ఈ రెండు కుటుంబ, అవినీతి పార్టీలేనని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ రెండూ అవినీతి పార్టీలే : కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేడా లేదని ఈ రెండు కుటుంబ, అవినీతి పార్టీలేనని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు.

ఈసందర్బంగా మాట్లాడుతూ మిగులు బడ్జెట్​ తో ఉన్న తెలంగాణను బీఆర్​ఎస్​10 ఏళ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చి తెలంగాణ ప్రజలపై కుటుంబ పాలన రుద్దింది అనేక అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణలో ప్రజలంతా పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, ఆ తెలంగాణ కేసీఆర్​ కుటుంబం చేతిలో ఎలా బందీ అయిపోయిందో మండిపడ్డారు. అనేక రకాల హామీలతో, అభయహస్తాలతో, గ్యారంటీలతో వస్తున్నామని చెప్పిన కాంగ్రెస్​కు ప్రజలు ఓట్లు వేస్తే రెండేళ్లు గడిచిన ఒక హామీ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి ఉచిత బస్సు, సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు గొప్పలు చెప్పి చేతులు దులుపుకుంటున్నారు.

సర్కారు తాము ఇస్తున్నామని చెప్తున్న ప్రతి కిలో సన్నబియ్యంకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.43 ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.13 మాత్రమే ఇస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి రెండేండ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేశారో, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలన్నారు. ఒక్క మార్పు మాత్రం జరిగిందని కేసీఆర్​ పోయి రేవంత్ రెడ్డి, గులాబీ జెండా పోయి కాంగ్రెస్​ జెండా వచ్చిందని ఎద్దేవా చేశారు. రైతులకు, నిరుద్యోగులకు, బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు, ఉద్యోగులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు అమలు ఏమైందన్నారు.

ఏ విషయంలో ప్రజాపాలన చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి. పోలీసులను పెట్టుకొని గ్రామాల్లో సభలు పెట్టుకొని తిరగడం కాదని ఇచ్చిన హామీల అమలు మీద చర్చకు సిద్ధమా అంటూ సవాల్​విసిరారు. రెండేండ్ల పాలనలో అమలు చేస్తే ఈ ఇందిరా పార్క్​ వేదికగా, ప్రజాభవన్​లో కానీ, ప్రెస్​క్లబ్​లో చర్చకు రేవంత్​ రెడ్డి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. మా పార్టీ తరఫున ఏ కార్యకర్త అయినా చర్చకు సిద్ధంగా ఉన్నాడు. గత 10 ఏండ్ల పాలనలో ప్రభుత్వ భూములను బీఆర్​ఎస్​ అమ్మకానికి పెట్టిందో నేడు కాంగ్రెస్​ ప్రభుత్వం కూడా భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందన్నారు.

ఉద్యోగులకు జీతాలు , రిటైర్డ్​ ఉద్యోగులకు పెన్షన్​, భూములు అమ్మకపోతే సంక్షేమ పథకాలు, బీరు, బ్రాంది అమ్మకపోతే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే బెల్ట్​ షాపులు లేకుండా చేస్తామని కాంగ్రెస్​ మేనిఫెస్టోలో పెట్టి రెండేండ్లు అయినా బెల్ట్​ షాపులు ఎందుకు మూసివేయడం లేదని నిలదీశారు. మద్యం అమ్మకాలతో లక్ష కోట్లకు పైగా ప్రజల నుంచి దోపిడీ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ రెండేండ్ల పాలనలో కాంగ్రెస్​ పార్టీ పూర్తి వైఫల్యం చెందింది. గతంలో బీఆర్​ఎస్​ చేసినట్లే ఇప్పుడు కాంగ్రెస్​ చేస్తోంది.

ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్​ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కే పార్టీలే, అక్రమాలకు పెద్దపీట వేసే పార్టీలేనన్నారు. ఇచ్చిన హామీల అమలు ఏమైందని కాంగ్రెస్​ పాలకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని కోరారు.

Next Story