- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామీణ ఉపాధికి బూస్ట్.. మంత్రి సీతక్క విజన్‌తో మార్పు
పంచాయతీ కార్యదర్శులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు జీపీలకు చేరుకుంటున్నారు? ఎలాంటి పనులు చేయిస్తున్నారు వంటి వివరాలన్నీ పంచాయతీ సెక్రటరీ యాప్ లో నమోదు అవుతుండటంతో పీఆర్‌ఆర్డీ కమిషనరేట్ నుంచి పర్యవేక్షించడం సులువుగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇది వరకు గ్రామాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల కోసం పబ్లిక్ ఎదురు చూడాల్సి వచ్చేది. వాళ్లు ఎప్పుడొస్తే అప్పటి నుంచే డ్యూటీలు.. ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవు.. కాలం మారింది.. సర్కారు చేతికి యాప్స్ వచ్చాయ్.. అంతే.. టైముకు డ్యూటీకొస్తున్నారు.. అది కూడా గ్రామాల్లో తొమ్మిదిలోపే.. 98 శాతం పంచాయతీ సెక్రటరీలు విధులకు హాజరు ప్రస్తుతానికి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక రికార్డ్. మంత్రి సీతక్క ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల నిరంతర పర్యవేక్షణలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేలా సిబ్బంది పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు సకాలంలో విధులకు హాజరవుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలలోపే గ్రామ పంచాయతీలకు చేరుకుని విధులు నిర్వర్తిస్తున్నారు.
యాప్‌లో నమోదుతో సులువు..
పంచాయతీ కార్యదర్శులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు జీపీలకు చేరుకుంటున్నారు? ఎలాంటి పనులు చేయిస్తున్నారు వంటి వివరాలన్నీ పంచాయతీ సెక్రటరీ యాప్ లో నమోదు అవుతుండటంతో పీఆర్‌ఆర్డీ కమిషనరేట్ నుంచి పర్యవేక్షించడం సులువుగా మారింది. దీంతో ఎప్పటికప్పుడు సమచారాన్ని తెలుసుకుంటూ..అనుగుణంగా జిల్లా స్థాయి, వారి కింది స్థాయి అధికారులకు చేరవేస్తూ మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు శాఖ సెక్రటరీ డీఎస్ లోకేశ్ కుమార్, డైరెక్టర్ డాక్టర్ జీ.సృజన ప్రణాళికాబద్దంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో ఉదయం 9 గంటలలోపే గ్రామ పంచాయతీల్లో విధులకు 98 శాతం సెక్రటరీలు హాజరవుతున్నారు. పారిశుద్ధ్య పనులు, ఇతర పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటూ ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారు. సరిగా పనులు జరగని గ్రామ పంచాయతీలను గుర్తించి సంబంధిత డీఎల్ పీవో, డీపీవోలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో జీపీల్లో నెలకొన్న సమస్యలు కొలిక్కివస్తున్నాయి.
ఎండ నుంచి రక్షించేందుకు చర్యలు..
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉపాధి కూలీలు వడదెబ్బ బారిన పడకుండా ఎండ నుంచి రక్షించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క సూచన మేరకు డీఆర్డీఏలందరికి డైరెక్టర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి పనులు జరగుతున్న ప్రాంతాలకు సమీపంలో కూలీలు సేదతీరేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మధ్యాహ్న సమయంలో పనులు చేయించొద్దని, ఉదయం పూట, సాయంత్రం 4 తర్వాతే పనులు చేయించాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రతి రోజు 10 లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించాలని టార్గెట్ పెట్టుకోగా..ఇప్పటి వరకు 9.45 లక్షల మందికి ప్రతిరోజు ఉపాధి లభిస్తోంది. ప్రతి జీపీలో సగటున 75 మంది కూలీలకు ఉపాధి హామీ పని లభిస్తోంది. ఈ సంఖ్యను 100కి పెంచేలా కూలీలను మొబిలైజ్ చేయడంతో పాటు అన్ని గ్రామ పంచాయతీల్లో విధిగా ఉపాధి పనులు చేపట్టేలా సంబంధిత డీఆర్డీఏలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.






