ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముచ్చెమటలు పట్టించిన ‘బొమ్మ’

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-14 02:52:51  IST  )

ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. తనిఖీల్లో విమానంలో దొరికిన అనుమానాస్పద వస్తువు అందరినీ టెన్షన్ పెట్టించింది

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ముచ్చెమటలు పట్టించిన ‘బొమ్మ’
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) శనివారం ఉదయం బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ఢిల్లీ (Delhi) నుంచి హైదరాబాద్ (Hyderabad) వస్తున్న ఇండిగో విమానానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లుగా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందింది. దీంతో శంషాబాద్‌లో రన్‌వేపై ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, విమానాన్ని తక్షణమే ఐసోలేషన్ బేకు తరలించారు.

ఉత్కంఠ రేపిన తనిఖీలు..

విమానంలోని ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందికి దించిన తర్వాత, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (Bomb Disposal Squad), CISF బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో విమానంలో ఓ అనుమానాస్పద బొమ్మ కనిపించడంతో భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. అది బాంబు అయి ఉంటుందనే అనుమానంతో ప్రత్యేక పరికరాల సాయంతో పరీక్షించారు. చాలాసేపు తనిఖీల అనంతరం ఆ బొమ్మలో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారు. అది ఓ ప్రయాణికుడు పొరపాటున విమానంలోనే మరిచిపోయిన సాధారణ బొమ్మగా తేలింది. దీంతో బాంబు బెదరింపు ఫేక్ ఈ-మెయిల్‌ అని అధికారులు నిర్ధారించడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, బాంబు ఉందంటూ ఫేక్ ఈ-మెయిల్ పంపిన నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story