ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు కలకలం..ఫ్లైట్‌లో పలువురు రాజకీయ నేతలు?

by Ramesh Naini |   (  Updated:2025-12-05 17:30:19  IST  )

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా (AI-2879) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు కలకలం..ఫ్లైట్‌లో పలువురు రాజకీయ నేతలు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా (AI-2879) విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం నిర్ణీత సమయమైన సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన ఫ్లైట్ సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా ప్రయాణం ప్రారంభించింది. అధికారుల అప్రమత్తతో శంషాబాద్‌ రన్‌వేపై ల్యాండ్ అయిన వెంటనే విమానాన్ని మిగతా ఫ్లైట్ల నుండి దూరంగా నిలిపివేసి, ఫైరింజన్లు సహా భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. ల్యాండింగ్‌ అయిన అరగంట గడిచినా, ప్రయాణీకులను విమానం నుంచి దిగనివ్వలేదు. పరిస్థితిపై స్పష్టత లేక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత ప్రయాణికులను ఒక్కొక్కరిని కిందకు దింపి, వారి లగేజ్‌ను ఎయిర్‌పోర్టు సిబ్బందికి హ్యాండోవర్ చేసిన అనంతరం మాత్రమే టెర్మినల్‌ నుండి బయటికు వెళ్లాలని ప్రకటించారు.

ఫ్లైట్‌లో పలు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు సమాచారం. వారిలో ఎమ్మెల్యే, ఎంపీ ఆర్. క్రిష్ణయ్య, బీహార్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాన్ని ప్రత్యేక ప్రాంతానికి తరలించి అధికారులు విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల సామాను, విమానంలోని అన్ని విభాగాలను జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, బాంబు బెదిరింపుతో శంషాబాద్ విమానాశ్రయంలో ఉత్కంఠ నెలకొని, భద్రతా చర్యలను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.

Next Story