బీజేపీ విధానాలతో దక్షిణానికి నష్టం: సీపీఐ ఆగ్రహం

by Ramesh Naini |

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శాశ్వత అధికారం కోసం దేశభక్తి ముసుగులో దేశ విచ్ఛిన్న, విభజన రాజకీయాలకు కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ విధానాలతో దక్షిణానికి నష్టం: సీపీఐ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ శాశ్వత అధికారం కోసం దేశభక్తి ముసుగులో దేశ విచ్ఛిన్న, విభజన రాజకీయాలకు కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ల పరంగా బీసీలకు, రాజకీయ ప్రాధాన్యత పరంగా దక్షణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. చట్టసభల స్థానాల పునర్విభజనకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు రాజ్యాంగ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించి అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యత తో కూడిన నిర్ణయం తీసుకోవాలని సాంబశివ రావు డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ.టి.నరసింహా, కార్యదర్శివర్గ సభ్యులు కళవేణ శంకర్ లతో కలిసి ఆయన మాట్లాడారు. చట్టసభల స్థానాల పునర్విభజన అంశంలో బీజేపీ సర్కార్ పూర్తిగా కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ఉన్న స్థానాల వత్యాసం కారణంగా వివక్ష కొనసాగుతోందని, మళ్లీ 50 శాతం స్థానాలు పెంచితే మరింత వత్యాసం పెరిగి ఈ రాష్ట్రాలు తీవ్రంగా నష్ట పోతున్నాయన్నారు. ఇదే అంశాన్ని ఆగ్రహించి 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, 25 ఏళ్ల పాటు సీట్ల పెంపును నిలిపివేయగా, 2001లో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి సైతం 2026 వరకు దీనిని కొనసాగించారన్నారు. ఈ నేపథ్యంలో సీట్ల పెంపునకు సంబంధించి పూర్తి శాస్త్రీయంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా తన రాజకీయ లబ్ధి కోసం శాశ్వత అధికారమే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.

దేశంలో భాగమైన దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేస్తూ మొత్తంగా 50 శాతం స్థానాలు పెంచాలనే నిర్ణయాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో 129 ఉన్న స్థానాలు 195 కు, ఉత్తరాది రాష్ట్రాలకు ఉన్న 395 స్థానాలు 621 కి పెరగనున్నాయని, దీంతో దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పూర్తి ప్రాధాన్యత తగ్గిపోయి తీవ్ర వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలు ఒక్కసారిగా 850కి పెరిగితే పార్లమెంట్ అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉండదని, మంద బలంతో అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టానుసారంగా వ్యవహరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

విప్లవాత్మక ప్రతి మార్పులో సీపీఐదే పాత్ర..

దేశంలో ఏ విప్లవాత్మక మార్పు జరిగిన సమాజ హితమే లక్ష్యంగా వచ్చిన ప్రతి బిల్లులో సీపీఐ కీలక పాత్ర పోషించిందని సాంబశివరావు తెలిపారు. సీపీఐ కృషి వల్లే చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆచరణ సాధ్యంలోకి వచ్చిందన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 1960లోనే సీపీఐ ఎంపీ రేణుక చక్రవర్తి మొట్టమొదటి సారి లేవనెత్తారని, అందుకు కొనసాగింపుగా ఎంపీ గీతా ముఖర్జీ అనేక ఉద్యమాలను నిర్వహించడంతో పాటు పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెట్టారని తెలిపారు. ఇదే క్రమంలో అప్పటి ప్రభుత్వం బిల్లు రూపకల్పనకు గీతా ముఖర్జీ నేతృత్వంలో వేసిన కమిటీ 1998లో మహిళా రిజర్వేషన్ బిల్లును రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసిందని, ఆ నివేదిక మేరకే 2010లో రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించిందన్నారు. ఆ తర్వాత 2023లో మోడీ ప్రభుత్వం లోక్ బిల్లును ఆమోదించిందన్నారు.

తేజస్వీ సూర్య ఎంపీగా అనర్హులు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంట్ సభ్యుడిగా అనర్హులని కూనంనేని సాంబశివరావు అన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ స్థానంలో ఉన్న ఆయన కనీసం అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం ఆక్షేపణీయమన్నారు. సూర్య వ్యాఖ్యలను తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు 6 మంది ఎంపీలు కనీసం నోరు విప్పకపోవడం దారుణమన్నారు. నాడు తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతును ఇచ్చిన సుష్మాస్వరాజ్ పాత్రను వీరు తప్పుపడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించినపోగా సమర్థిస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

Next Story