బీసీ రిజర్వేషన్లపై బీజేపీది వితండవాదం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-23 12:36:20  IST  )

విద్య, ఉద్యోగావకాశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో రెండు తీర్మానాలను చేసి పార్లమెంట్‌కు పంపామని.. కానీ, ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

బీసీ రిజర్వేషన్లపై బీజేపీది వితండవాదం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: విద్య, ఉద్యోగావకాశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో రెండు తీర్మానాలను చేసి పార్లమెంట్‌కు పంపామని.. కానీ, ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్ నిలిచిందని అన్నారు. వందేళ్లుగా వాయిదా పడిన కులగణనను నెల రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. విద్య, ఉద్యోగ అవకాశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో రెండు తీర్మానాలను చేసి పార్లమెంట్‌కు పంపామని పేర్కొన్నారు. కానీ, వాటిని ఆమోదించకుండా కేంద్రం జాప్యం చేస్తోందని అన్నారు. తన అధినేత రాహుల్ గాంధీ ద్వారా ఆ బిల్లుల ఆమోదంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రేపు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలిసి కులగణన, రిజర్వేషన్లపై చర్చిస్తామని అన్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలను కూడా కలుపుకుని పోతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌కు ఓ రాజ్యాంగం.. బీజేపీకి ఓ రాజ్యాంగం ఉండదు

కులగణన అంశాలను ఉభయ సభల్లోని కాంగ్రెస్ ఎంపీలకు వివరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం చేస్తోందని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు వాదన వింతగా ఉందన్నారు. మీరు ఇచ్చిన హామీని.. మీరే అమలు చేసుకోవాలని అంటున్నారని.. ఇది వితండవాదం కాక మరేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌‌కు ఓ రాజ్యాంగం.. బీజేపీకి ఓ రాజ్యాంగం ఉండదని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎలాగైనా బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు సాకులు వెతుకుతున్నారని ఆరోపించారు. కులగణనపై నిపుణుల కమిటీ ఓ నివేదికను ఇచ్చిందని.. కేబినెట్, అసెంబ్లీలో చర్చించాక దీన్ని ప్రజల ముందు ఉంచుతామని అన్నారు. డేటీ ప్రైవసీ యాక్ట్ ప్రకారం వ్యక్తిగత డేటా ఇవ్వడానికి వీలు లేదన్నారు. ముస్లింలకు మతం ప్రాతిపదికగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, వెనుకబాటుతనమే ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 38 ముస్లిం ఉప కులాలు రిజర్వేషన్లు పొందుతున్నాయని పేర్కొన్నారు. గుజరాత్ 27, ఉత్తర్ ప్రదేశ్‌లో 7 ముస్లిం ఉప కులాలు రిజర్వేషన్లు పొందుతున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

బీసీలకు కేసీఆర్ అన్యాయం చేశారు..

ఒక వర్గం పేరు చెప్పి తెలంగాణలో బీసీ రిజర్లేషన్లపై బీజేపీ మొండి వాదనను తెరపైకి తీసుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్న వాళ్లే సందేహాలను లేవనెత్తుతున్నారని కామెంట్ చేశారు. తెలంగాణలో సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిందని.. కేంద్ర త్వరగా రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తే.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని కుండబద్దలు కొట్టారు. మూడు రైతు వ్యతిరేక చట్టాల విషయంలో ఏం జరిగిందో అందరూ చూశారని, రైతు చట్టాల రద్దు స్ఫూర్తిగా బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదం కోసం పోరాడుతామని అన్నారు. ముస్లింల పేరుతో మరోసారి భావోద్వేగ రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తోందని.. తాము కల్పించే రిజర్వేషన్లలో మతం ప్రస్తావనే లేదని అన్నారు. బీసీలకు అన్యాయం చేసేలా గతంలో కేసీఆర్ పంచాయతీ రాజ్ చట్టానికి సవరణలు చేశారని, కానీ, తాము సామాజిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించ ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story