- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు ముక్కలైన కాంగ్రెస్.. చక్రం తిప్పిన బండి సంజయ్
కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీని మూడు ముక్కలుగా విభజించి బీజేపీ గెలుపును కైవసం చేసుకుంది.

దిశ, కరంనగర్ బ్యూరో: కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బీజేపీ తన సత్తాను చాటుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీని మూడు ముక్కలుగా విభజించి బీజేపీ గెలుపును కైవసం చేసుకుంది. బీజేపీ ఎక్కడా ఆర్భాటం చేయకపోయినప్పటికీ చాపకింద నీరులా ప్రచారం చేసి ప్యానల్‌ను గెలిపించుకుంది. పోటీ చేసిన మూడు ప్యానళ్లు కూడా నిన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఉన్నవారే కావడం విశేషం. కొందరు కాంగ్రెస్ నాయకులు వెలిచాల ప్యానల్‌కు దూరంగా ఉండి రహస్యంగా మరో అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో క్యాడర్ గందరగోళానికి గురైంది. ఎన్నికల తర్వాత విజేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీస్సుల కోసం వెళ్లడం, బీజేపీ దీన్ని తమ గెలుపుగా ప్రచారం చేసుకోవడం కాంగ్రెస్‌కు షాక్‌గా మారింది. ఈ ఫలితం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుందని చెప్పకనే చెప్పింది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారడంతో ఆ పార్టీ నాయకులు అధిష్టానం ముందు తలదించుకునే పరిస్థితి నెలకొన్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మరోసారి తన సత్తాను చాటుకుంది. అయితే ఈసారి అధికార కాంగ్రెసు పార్టీని మూడు ముక్కలుగా విభజించి గెలుపును కైవసం చేసుకోవడం ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలో ఉన్నా కరీంనగర్ లో మాత్రం ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది. అర్బన్ బ్యాంకు నామినేషన్ ప్రక్రియ మొదలైన నాటినుంచి ఎక్కడా బీజేపీ ఆర్బాటం చేయకపోయినప్పటికీ చాపకింద నీరులా తన ప్రచారాన్ని సాగించి ప్యానల్‌ను గెలుపించుకుని దట్ ఈజ్ బీజేపీ అని నిరూపించింది. కాంగ్రెసులో తలపండిన నేతలు ఉండి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఆ పార్టీలోని నాయకులనే కోవర్టులుగా మలుచుకున్న బీజేపీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే పంథాను అనుసరిస్తామంటూ చెప్పకనే చెప్పిన పరిస్థితి నెలకొన్నది.
మూడు ముక్కలుగా వీడిన కాంగ్రెస్
కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ విసిరిన పంజాకు కాంగ్రెసు పార్టీ కుదేలైంది. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను పెట్టడం లేదంటూ చెప్పినప్పటికీ పోటీ చేసిన మూడు ప్యానళ్లు కూడా నిన్నటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులుగా కొనసాగినవారే కావడం విశేషం. ప్రచారంలో సైతం మేమే అసలైన కాంగ్రెస్ పార్టీ వారమంటూ ప్రచారం చేసినప్పటికీ చివరకు ఓటింగ్ జరిగి గెలుపు ఖాయం కావడంతోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆశీస్సుల కోసం వెళ్లడం బీజేపీ సైతం గెలుపును తమ ఖాతాలో వేసుకుని సోషల్ మీడియాలో అదరగొట్టే స్థాయిలో ప్రచారం నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌గా తయారైంది.
దడ పుట్టిస్తున్న అనైతిక పొత్తు..
సహజంగా ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను గుర్తించి ఒక ప్యానల్‌గా ఏర్పాటు చేసి వారి గెలుపుకోసం ప్రచారం సాగిస్తుంటాయి. కానీ కరీంనగర్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో మాత్రం పార్టీ లేదు, ప్యానల్ లేదు అన్నట్టుగా మూడు
పార్టీలకు చెందిన వారు ఓ సామాజికవర్గం కేంద్రీకృతంగా ప్యానల్‌ను ఏర్పాటు చేయడం రాబోయో రోజుల్లో మూడు ప్రధాన పార్టీలకు సైతం ప్రమాదం తప్పదనే చర్చ జోరందుకుంది. అయితే ఇప్పుడు రెండు అధికార పార్టీలు ఒక్కటి కేంద్రంలో మరోటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అభ్యర్థులు తమ గెలుపే లక్ష్యంగా పార్టీలతో పనిలేదన్నట్టుగా వ్యవహరించడం ఇక్కడ భవిష్యత్‌లో పార్టీల పరిస్థితికి అద్దం పట్టేలా తయారైంది అనే చర్చ జోరందుకుంది.
పరిస్థితి ముందే పసిగట్టిన వెలిచాల
కరీంనగర్ రాజకీయ పరిస్థితులను ముందే పసిగట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు ముందు చూపుతో అనైతిక పొత్తును వ్యతిరేకిస్తూ వ్యక్తిగతంగా ఓ ప్యానల్‌ను ఏర్పాటు చేసి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికోసం ప్రచారం నిర్వహించినప్పటికీ డీసీసీ అధ్యక్షుడు మానకోండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి వెలిచాల ప్యానల్‌తో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటూ బాహాటంగా ప్రచారం చేయడం, రహస్యంగా ఓ అభ్యర్థికి ప్రచారం నిర్వహించడం పార్టీ క్యాడర్‌ను గందరగోళానికి గురిచేసింది. దీంతో పార్టీ మూడు ముక్కలుగా చీలిందనే అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితులు కాంగ్రెస్ నాయకులను ప్రమాదంలోకి నెట్టేయడంతో అదిష్టానం ముందు తలదించుకునే పరిస్థితి నెలకొన్నది.






