vote chori: మీరు ఎవరికి ఓటు వేసినా గెలిచేది బీజేపీనే.. తెలంగాణ బీజేపీ ఎంపీ వీడియో వైరల్

by Prasad Jukanti |   (  Updated:2025-08-16 11:45:28  IST  )

ఓటు చోరీ వ్యవహారం తెలంగాణకు పాకింది.

vote chori: మీరు ఎవరికి ఓటు వేసినా గెలిచేది బీజేపీనే.. తెలంగాణ బీజేపీ ఎంపీ వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న 'ఓటు చోరీ' (Vote chori) పాలిటిక్స్ తెలంగాణకు పాకింది. ఈసీ, బీజేపీ కుమ్మక్కై భారీ ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతున్నదంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సహా విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుంటే ఈ ఆరోపణలను ఈసీ (EC) తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ ఇక యుద్ధమేనని ప్రకటించింది. ప్రచారానికి వెబ్‌పోర్టల్‌ను సైతం ప్రారంభించి అందులో రిజిస్టర్‌ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఓటు చోరీ వ్యవహారం తెలంగాణకు పాకడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మీరు ఎవరికి ఓటు వేసినా గెలిచేది బీజేపీనే అంటూ గతంలో తెలంగాణ బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఎవరికి ఓటేసినా గెలిచేది బీజేపీనే:

ఓటు చోరీ అంశంపై పెద్దఎత్తున వివాదం సాగుతున్న వేళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. 'మీరు నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తా. మీరు కారు గుర్తుకు ఓటు వేసినా నేనే గెలుస్తా. హస్తం గుర్తుకు ఓటు వేసినా నేనే గెలుస్తా. మీరు ఎవరికి ఓటు వేసినా రాబోయేది మోడీనే' అంటూ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. నిజానికి అర్వింద్ మాట్లాడిన ఈ వీడియో 2023 ఆగస్టుకు సంబంధించినది అని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఓటర్ల జాబితా, ఈవీఎంల కాంట్రవర్సీ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో అర్వింద్ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ తప్పుడు మార్గాల్లో గెలిచిందనడానికి అర్వింద్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటూ కామెంట్ చేస్తున్నాయి.

తెలంగాణలో అండర్ కవర్ ఓట్ చోరీ:

తాజా పరిణామాల నేఫథ్యంలో తెలంగాణలోనూ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల క్రితం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తెలంగాణలో బీజేపీ 8 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు గెలిచింది. హైదరాబాద్ స్థానంలో ఎంఐఎం గెలిచింది. దీని వెనుక ఓటు చోరీ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా అండర్ కవర్ గా జరుగుతోందని ఇప్పుడిప్పుడే బయటకు వస్తోందని అన్నారు. ఎంక్వైయిరీ చేస్తే ఈ బండారం అంతా బయటపడుతుందన్నారు. ఈ ఓటు చోరీ అడ్డుకోకపోతే కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని హాట్ కామెంట్స్ చేశారు. తాను ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి చాలా సార్లు ఫిర్యాదు చేశాన్నారు.

బీజేపీ కౌంటర్ ఎటాక్:

కాంగ్రెస్ ఆరోపణలకు బీజేపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. తాజాగా మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కలిసి తన పార్లమెంట్ నియోజవర్గం పరిధిలో దొంగఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. అలాగే తాము రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గంలో ఎంక్వైయిరీ చేశామని అక్కడ 2 లక్షల ఓట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని సంచనల వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా జాతీయ స్థాయిలో మొదలైన ఓట్ల రాజకీయం ఇప్పుడు తెలంగాణలోను దుమారం రేపుతుండటంతో ఈ వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Next Story