Akhilesh Yadav: ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ SIRను బ్యాక్ డోర్‍గా వాడుతోంది.. HYD వేదికగా అఖిలేశ్ యాదవ్

by Prasad Jukanti |

హైదరాబాద్ పర్యటనలో ఉన్న అఖిలేశ్ యాదవ్ విజన్ ఇండియా సమిట్‌లో మాట్లాడారు.

Akhilesh Yadav: ఎన్నికల్లో గెలిచేందుకు  బీజేపీ SIRను బ్యాక్ డోర్‍గా వాడుతోంది.. HYD వేదికగా అఖిలేశ్ యాదవ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ ఎస్ఐఆర్‍ను NRC కు బ్యాక్ డోర్‍గా ఉపయోగిస్తోందని యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‍వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) విమర్శించారు. బీఎల్ఓలకు సాంకేతికత వినియోగంలో అవగాహన లేదని వారికి శిక్షణ కూడా లేదని విమర్శించారు. సమాజ్‍వాది పార్టీ అధ్యక్షతన ఇవాళ హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో విజన్ ఇండియా సమ్మిట్ ను (Vision India Summit) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడిన అఖిలేశ్ యాదవ్.. ఏఐ మానవ భావోద్వేగాలు, సంబంధాలను బలపరిచి, మానవ ఆలోచనలను సానుకూలంగా మార్చగలిగితే వివక్షను తొలగించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను కేవలం సౌకర్యం కోసం కాకుండా మానవాళి సమగ్ర వృద్ధి కోసం అభివృద్ధి చేయాలని అన్నారు. ఓ వైపు ఏఐ అభివృద్ధి జరుగుతుంటే గ్రామీణ భారతాన్ని ఏఐతో ఎలా అనుసంధానిస్తామనేది మనందరి ముందు ఉన్న అతి పెద్ద సవాల్ అన్నారు. వ్యవసాయం, హెల్త్, మౌళిక సదుపాయల వంది వివిధ రంగాల్లో ప్రజలతో ఏఐని ఎలా చేరువ చేయగలమో ఆలోచించాలన్నారు. విజన్ ఇండియా సమిట్ సిరీస్ భారత అభివృద్ధికి ప్రగతిశీల, ప్రాయోగిక, నిర్మాణాత్మక ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అందరికీ కలిసి పనిచేసే వేదికను అందించడం ద్వారా, భారత్‌ను ‘నియో ఇండియా’గా మార్చే లక్ష్యానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచిందన్నారు. 108 అంబులెన్స్ ను హైదరాబాద్‍లో తొలుత ప్రారంభమయ్యాయని ఇక్కడి స్ఫూర్తితో తాము యూపీలో ఈ అంబులెన్స్ లను అమలు చేశామన్నారు.

Next Story