రైతులను అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Naga Rani Yarlagadda |

బీజేపీ బస్సు యాత్రకి పోయిన నాయకుల్లో ఒకరంటే ఒకరికి గిట్టదని, బీజేపీ నేతలు బస్సు యాత్ర కాదు ఢిల్లీ యాత్ర చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు.

రైతులను అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ బస్సు యాత్రకి పోయిన నాయకుల్లో ఒకరంటే ఒకరికి గిట్టదని, బీజేపీ నేతలు బస్సు యాత్ర కాదు ఢిల్లీ యాత్ర చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిలదీశారు. సోమవారం ఆయన సీఎల్పీలోని మీడియా హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లడుతూ బీజేపీ, బీఆర్ఎస్ మిత్ర పక్షాలని, కేంద్రంలోని బీజేపీని బీఆర్ఎస్ ఒక్క మాట కూడా అనడం లేదని ఆయన ఆరోపించారు. రైతులను అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తోందని, ధాన్యం కొనుగోలు అంశంలో ప్రభుత్వాన్ని తప్పు పడితే సరికాదన్నారు. హరీష్ రావు కళ్లాల దగ్గరికి వెళ్ళి షో చేస్తున్నారని, రాష్ట్రంలో పండిన పూర్తి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని బీఆర్ఎస్ కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఆది శ్రీనివాస్ సూచించారు. రైతులపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని, రైతులే బీజేపీకి వ్యతిరేకంగా అనేకసార్లు నిరసనలు చేశారని ఆయన గుర్తు చేశారు. రైతులకు వ్యతిరేకంగా బీజేపీ నల్ల చట్టాలు తీసుకువచ్చారని, రైతు ఉద్యమానికి మోదీ దిగివచ్చి రైతులకు క్షమాపణలు చెప్పారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. బీజేపీ 700 మంది రైతులను బలి తీసుకుందని, యూపీలో రైతులను తొక్కించి చంపిన సంఘటనలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రైతులపైకి బీజేపీ మంత్రుల కాన్వాయ్ తీసుకెళ్లి చంపారని ఆయన ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లు పెట్టే ఒప్పందాన్ని మోదీతో కేసీఆర్ చేసుకున్నారని ఆరోపించారు. కేంద్రం వెంటవెంటనే మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బీజేపీ నేతలకు రైతుల‌పైన ప్రేమ ఉంటే ధాన్యం కొనుగోలు కోసం మోదీ ఇంటి ముందు ధ‌ర్నా చేయాలి : ప్రభుత్వ విప్, విజ‌య‌ ర‌మ‌ణారావు

రైతు గురించి మాట్లాడే హ‌క్కు బీజేపీకి లేదని, రైతు వ్యతిరేక న‌ల్లచ‌ట్టాలు తెచ్చిన చ‌రిత్ర బీజేపీదని ప్రభుత్వ విప్, విజయరమణా రావు విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పండించిన పంట ను మ‌ద్దతు ధ‌ర ఇచ్చి ప్రభుత్వం కోనుగోలు చేస్తోందని, కేంద్రం కేవ‌లం 52 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని మాత్రమే సేక‌రిస్తోందని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లి క‌లిసినా కేంద్రం నుంచి స్పంద‌న లేదని, కేంద్రం రైతుల కోసం ఏం చేసిందో బీజేపీ నాయకులు చెప్పాలని విజయరమణా రావు డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 12 యేళ్ల పాల‌న‌లో రైతుల‌కు ఏమీ చేయ‌లేదని, కేంద్రం రుణ‌మాఫీ లేదు, బోన‌స్ లేదు, మ‌ద్దతు ధ‌ర ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బీజేపీ నేతలకు రైతుల‌పైన ప్రేమ ఉంటే మోదీ ఇంటి ముందు ధ‌ర్నా చేసి మొత్తం ధాన్యం కొనుగోలు చేసేలా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ఎరువులు ఇవ్వదు, విత్తనాలు ఇవ్వదు, వ్యవ‌సాయ ప‌నిముట్లు ఇవ్వడం లేదని విజయరమణా రావు ఆరోపించారు.

Next Story