హక్కుల కోసం బీజేపీ ధర్మ యుద్ధం.. రిటైర్డ్​ ఉద్యోగులపై బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని, రేవంత్​ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులను పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ఆరోపించారు.

హక్కుల కోసం బీజేపీ ధర్మ యుద్ధం.. రిటైర్డ్​ ఉద్యోగులపై బీజేపీ స్టేట్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలని, రేవంత్​ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగులను పట్టించుకోలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని యువత ఆశించారని రాష్ట్రంలో ఉద్యోగాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని, పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. మంగళవారం రిటైర్డ్​ ఉద్యోగుల బెనిఫిట్స్​ తక్షణమే చెల్లించాలని డిమాండ్​చేస్తూ ఇందిరా పార్క్​వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు-నిధులు, నియామకాల నినాదంతో స్వరాష్ట్రం కోసం ఉద్యమం కొనసాగిందని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాలు ఒకేసారి అందించలేదని, రిటైర్ అయ్యే రోజు ఉద్యోగిని ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపించాలని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పీఆర్సీ, డీఏలు, గ్రాట్యూటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి అన్ని రిటైర్మెంట్ ప్రయోజనాలను నిలిపివేసింది. దేశంలో ఎక్కడా ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు.. తెలంగాణలో ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గతేడాది మార్చిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతి నెల రూ.700 కోట్లు విడుదల చేస్తామని ఏడాదిలో అన్ని బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చిన ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్ల కుటుంబాలు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.

బెనిఫిట్స్​ రాకపోవడంతో 40 మంది మృత్యువాత

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 40 మంది రిటైర్డ్ ఉద్యోగులు మనస్తాపంతో మరణించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉభయ సభల్లో ఉద్యోగుల సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సోయి లేకుండా వ్యవహరించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు రూ. 4 వేల భృతి ఇస్తామని చెప్పి మాట తప్పింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో అవకతవకలతో కోర్ట్‌లో కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందన్నారు. వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగాల ఆశతో అశోక్ నగర్ వంటి ప్రాంతాల్లో కోచింగులు తీసుకుని, శ్రద్ధగా చదువుతూ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వారి తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఆస్తులు అమ్మి, కోచింగ్ ఫీజులు చెల్లిస్తూ వనరులను సమకూర్చుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదు.. విశ్వవిద్యాలయాల్లో కూడా జీతాలు సమయానికి అందడం లేదు, ఫలితంగా ఉద్యోగులు, విద్యార్థులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, ఎక్కడ నుంచి తీసుకురావాలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వ స్పందన లేకపోవడం కూడా తీవ్ర నిరాశ కలిగిస్తోందన్నారు. ఉస్మానియాకు వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఒక రూపాయ విడుదల చేయలేదు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే శక్తి ఉద్యోగులకే ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ సమస్యలను వ్యక్తం చేసేందుకు, నిరసనగా ఓటుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సూచించారు. నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్ల హక్కుల కోసం ఉద్యమిస్తున్న బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బుద్ధిచెబుతూ, ఉద్యోగుల, రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్ల హక్కుల కోసం బీజేపీ ధర్మ యుద్ధాన్ని కొనసాగిస్తుందన్నారు.

సమస్యలు వెంటనే పరిష్కరించాలి

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని, దాదాపు 40 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగ్యులు చనిపోయారు అని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందని, అధికారంలోకి రాకముందు ఇదే పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి పెండింగ్​లో ఉన్న డీఏలను తక్షణమే చెల్లిస్తామని గొప్పలు చెప్పాడు, ఇప్పటి వరకు ఐదు డీఏలు పెండింగ్లో ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు చెల్లించడం లేదని నిలదీశారు. సప్లిమెంటరీ బిల్లులను 15 రోజుల్లో చెల్లిస్తామన్నారు, ప్రస్తుతం సీపీఎస్ బిల్లును రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఎల్ ఇచ్చే పెన్షన్లను కూడా సకాలంలో చెల్లిస్తానన్నారు. రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బంది పడుతున్న టువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఇచ్చే ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వకుండా ఎందుకు ఇలా గోసపెడుతున్నదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్స్ లో హెల్త్ కార్డులు జారీ చేయకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వేతనంలో కట్ చేసినటువంటి పీఎఫ్‌ను కూడా చెల్లించడం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పార్టీ వారి పక్షాన పోరాటం చేస్తుందని తెలిపారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ల దగ్గర నుంచి కమిషన్లు వస్తాయని రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తే ఏమి రావని ఇలా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం వీరి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వారి పక్షాన నిలబడి బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు.

Next Story