పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలి : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, కేంద్ర మంత్రి బండి డిమాండ్

by Ramesh Naini |

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం జనరంజకమైన నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ ​రావు హర్షం వ్యక్తం చేశారు.

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలి : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు, కేంద్ర మంత్రి బండి డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం జనరంజకమైన నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ ​రావు హర్షం వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు తీపి కబురు అందించిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వం డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని ఏకంగా సున్నా స్థాయికి తగ్గించడం మోడీ పరిపాలనా దక్షతకు నిదర్శనం అన్నారు. పెట్రోల్‌పై కూడా రూ 10 మేర భారాన్ని తగ్గించి కేంద్రం తన బాధ్యతను చాటుకుంది.. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతను ఎప్పుడు నెరవేరుస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాట్ సుమారు 35 శాతం ఉండటంతో సామాన్యుడిపై పెను భారం పడుతోంది. కేంద్రం పన్నులు తగ్గిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఇది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులు, ఆయిల్ బాండ్ల భారం ఉన్నా కేంద్రం వెనక్కి తగ్గలేదు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండుతోంది. పెట్రోల్ ధరలో కేంద్రం వాటా కంటే రాష్ట్రం వాటాయే ఎక్కువగా ఉండటం అత్యంత దురదృష్టకరం అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ఇప్పటికైనా మాటల గారడీలు పక్కన పెట్టి, తక్షణమే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం తన పన్ను వాటాను తగ్గిస్తేనే పెట్రోల్ ధర రూ. 100 లోపు వచ్చే అవకాశం ఉంటుంది. సామాన్యుడికి నిజమైన ఊరట నివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలి : బండి

ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్​డీఏ ప్రభుత్వం అగ్రభాగాన ఉంటుందనడానికి పెట్రోల్, డీజిల్​పై ఎక్సైజ్​సుంకం తగ్గించడమే నిదర్శనమని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలి. ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను మరింతగా అందుబాటులోకి తేవాలి. చమురు ధరలు తగ్గిస్తే సంక్షోభ సమయంలో నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రజల మేలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్రోల్, డీజిల్ పై వెంటనే వ్యాట్ తగ్గించాలని డిమాండ్​చేశారు.

Next Story