రెబల్‌గా పోటీ చేస్తే 15 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ : రాంచందర్ ​రావు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

రెబల్‌గా పోటీ చేస్తే 15 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ : రాంచందర్ ​రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించేందుకు వినూత్నంగా రూపొందించిన ఎల్ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు స్థానిక సంస్థల స్థాయిలో బీజేపీ దృష్టికోణం, విజన్‌ను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో ఈ ఎల్ఈడీ ప్రచార రథాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా పార్టీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగరాభివృద్ధిపై బీజేపీ ప్రతిపాదనలు ప్రజలకు సులభంగా, స్పష్టంగా చేరతాయని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల తెలంగాణ ఇన్‌ఛార్జ్ ఆశిష్ షెల్లార్, ఎన్నికల కో-ఇన్‌ఛార్జులు, రేఖా శర్మ, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు.

బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదు..

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున భీపామ్​లు పొందిన వారు మాత్రమే ఎన్నికల బరిలో ఉండాలని, నామినేషన్లు వేసిన మిగిలిన బీజేపీ నాయకులంతా తక్షణమే నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కోరారు. అనేక సర్వే నివేదికల ఆధారంగా, సామాజిక పరమైన అంశాలతో పాటు పార్టీ ప్రత్యేక అంశాలతో గెలిచే అవకాశాలు ఉన్నాయన్న అభ్యర్థులకే టిక్కెట్లు ఖరారు చేయడం జరిగింది. టికెట్ రాని వాళ్ళు బాధపడడం సహజమని, గత అనేక సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధి కోసం గెలుపు కోసం పనిచేస్తున్న కార్యకర్తలు పార్టీ గుర్తుంచుకుంటుంది. పార్టీ కార్యకర్తల కృషి, బీజేపీ పట్ల ప్రజలకున్న విశ్వాసంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయాలు సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కార్యకర్తల కృషితో ప్రజల మద్దతుతోనే పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విజయ పరంపర కొనసాగిస్తుందన్న విశ్వాసం రాష్ట్ర పార్టీకి పూర్తిగా ఉంది.. అని పేర్కొన్నారు. వెంటనే నామినేషన్లను ఉపసంహరించుకుని వారి డివిజన్లు, వార్డుల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధుల గెలుపు కోసం పనిచేయాలని కోరారు. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా రెబల్ అభ్యర్థులుగా పోటీ చేస్తే మాత్రం పార్టీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా పరిగణిస్తుందని తెలిపారు. ఎవరైనా నామినేషన్లను ఉపసంహరించుకోకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకుంటే వాళ్లను 15 ఏళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. భవిష్యత్తులోనూ అలాంటి వారిని తిరిగి బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story