సింగరేణి- నైని బ్లాక్ వివాదంపై దర్యాప్తు జరిపించాలి: బీజేపీ స్టేట్ చీఫ్ డిమాండ్

by Ramesh Naini |

సింగరేణిలో జరిగిన కుంభకోణాల్లో సగం పాపం గతం బీఆర్ఎస్ పాలకులది కాగా, మిగతా సగం పాపం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ఆరోపించారు.

సింగరేణి- నైని బ్లాక్ వివాదంపై దర్యాప్తు జరిపించాలి: బీజేపీ స్టేట్ చీఫ్ డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : సింగరేణిలో జరిగిన కుంభకోణాల్లో సగం పాపం గతం బీఆర్ఎస్ పాలకులది కాగా, మిగతా సగం పాపం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో కూడా సింగరేణి కాంట్రాక్టులు తమ సొంత మనుషులకే ఇచ్చిందని, ఒకప్పుడు సింగరేణిలో వేలాది మంది ఉద్యోగులు ఉండగా, కేసీఆర్​ అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగుల సంఖ్య 42 వేల వరకు తగ్గిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మరింతగా తగ్గి సుమారు 38 వేలకే పరిమితమైందని మండిపడ్డారు. కార్మికుల రక్తం, చెమటతో లాభాల్లో నడిచిన సింగరేణిని పక్కన పెట్టి, ప్రస్తుతం అదే సింగరేణి పేరుతో వ్యాపారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి - నైని బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారం కమీషన్లు కాంట్రాక్టుల పేరుతో కాంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనమని, నైని బ్లాక్ కేసు ద్వారా కాంగ్రెస్ పాలనలో టెండర్లు అభివృద్ధి కోసం కాకుండా కేవలం కమీషన్ల కోసమే జరుగుతున్నాయన్న నిజం బయటపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలపై కాకుండా కమీషన్ల గురించే ఆలోచన పెట్టిందని, సింగరేణి కార్మికుల రక్తం, చెమట పీల్చి కాంగ్రెస్ నాయకులు కమీషన్లు దండుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుల సొంత మనుషులు, బంధుమిత్రులకే కోల్ బ్లాక్స్, కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక హక్కు వారికి లేదు..

బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక హక్కు వారికి లేదని హెచ్చరించారు. దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణి నష్టాల్లో ఉందని చెప్పడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.50 వేల కోట్లకు పైగా బకాయి పడిందన్నారు. నష్టాల్లో ఉందని చెబుతున్న సింగరేణి నుంచి మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్‌షిప్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. లాస్‌లో ఉన్న సంస్థతో ఇంత భారీ ఖర్చులు ఎలా పెట్టారని దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. సైట్ విజిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చి, ఆ విధానం పేరుతో అక్కడికి వెళ్లి తమకు సంబంధించిన వారికే టెండర్లు ఇవ్వాలనే కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటోందని, ఇది పూర్తిగా ప్లాన్డ్ స్కామ్ అంటూ ఆరోపించారు. సింగరేణి పరిస్థితికి, నైని బ్లాక్‌లో జరుగుతున్న అవకతవకలకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత వహించాల్సిందేనన్నారు.

కార్పొరేట్​కంపెనీల విషయంలో మంత్రుల మధ్య విభేదాలు

నైని బ్లాక్ టెండర్లను ఎందుకు రద్దు చేశారో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్పొరేట్ కంపెనీల విషయంలో మంత్రుల మధ్యే విభేదాలు బయటపడ్డాయి. ఒక మంత్రి, ఒక పీఏ కలిసి సిమెంట్ కంపెనీని బెదిరించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరో మంత్రి ఆ వ్యవహారంలోకి రావద్దు అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వంలో మంత్రుల మధ్య జరుగుతున్న గొడవలు, కమిషన్ల పంచాయతీలు రోజు రోజుకు బయటపడుతూ, పాలన ఎంత దారుణంగా మారిందో స్పష్టమైతుందన్నారు. సింగరేణిలో జరిగిన అవకతవకలపై మాజీ మంత్రి హరీష్ రావు నిజంగా ఎంక్వైరీ జరగాలని కోరుకుంటే, ఆ విచారణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అన్ని వ్యవహారాలపై జరగాల్సిందేనని డిమాండ్​ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్, విజిలెన్స్ ఉంది. కేంద్రంలో సీబీఐ, ఈడీ ఉన్నాయి. ఏ సంస్థ దర్యాప్తు చేసినా సరే, దర్యాప్తు బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచే ప్రారంభం కావాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, కోల్ స్కామ్ - ఇవన్నీ సెలెక్టివ్‌ అంశాల్లో మాత్రమే కాకుండా హోలిస్టిక్‌గా, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై విచారణ జరగాలన్నారు.

టీవీ ఛానళ్ల మధ్య గొడవ కాదు..

టీవీ ఛానళ్ల మధ్య గొడవ కాదు. ఇది కాంగ్రెస్‌లోని మంత్రుల మధ్య, గ్రూపుల మధ్య జరుగుతున్న గొడవ అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తుపాకీ పెట్టి కార్పొరేట్ కంపెనీలను బెదిరించడం, మీడియాలో కథనాలు రాగానే టెండర్లు రద్దు చేయడం పారదర్శకత లేదనడానికి నిదర్శనాలు అన్నారు. తమ పార్టీలోని ఒక వర్గం బీఆర్ఎస్‌కు, మరో వర్గం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇది కాంగ్రెస్-బీఆర్ఎస్ సృష్టించిన కథనం మాత్రమే. బీజేపీ ఒక టీమ్‌గా ఐక్యంగా పనిచేస్తుందన్నారు.

Next Story