ఉపాధి హమీ పథకం బలోపేతం చేసేందుకు కొత్త చట్టం: BJP చీప్​ రాంచందర్​రావు

by Ajay Maddhiboyina |

గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వీబీ జీ రామ్​జీ యాక్ట్​ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు.

ఉపాధి హమీ పథకం బలోపేతం చేసేందుకు కొత్త చట్టం: BJP చీప్​ రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వీబీ జీ రామ్​జీ యాక్ట్​ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా అభయ పాటిల్​, చంద్రశేఖర్​తివారీతో కలిసి మాట్లాడుతూ ప్రధాని మోడీని విమర్శించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేయడంతో పాటు, ఈ చట్టంపై ప్రజల్లో అపోహలు, అపార్థాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ప్రతిపక్షాల కుట్రలను పటాపంచలు చేయాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, అవి అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అదే విధంగా త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లలో అభ్యర్దులు విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్​,బీఆర్​ఎస్​పార్టీల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను ప్రజలకు వివరించాలని, ఇద్దరే ఒకటేననే సంగతి బయటబయలు చేయాలని పేర్కొన్నారు.

ఉపాధి చట్టంపై శాసన సభలో వ్యతిరేకంగా తీర్మానం సరికాదు :

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) - వీబీ జీ రామ్​యాక్ట్ -2025ను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం ఖండించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మరింత ఆధునికీకరించి, కొత్త అవసరాలకు అనుగుణంగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రతి పేదవాడికి ఉపాధి, ఉపాధితో పాటు గౌరవం అనే ఆలోచనతో తీసుకొచ్చిన ఈ చట్టం వికసిత్ భారత్ 2047 జాతీయ విజన్‌కు అనుగుణంగా గ్రామీణ అభివృద్ధికి కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తుంది. ఇది మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగానే గ్రామ స్వావలంబన, గ్రామ స్వాభిమానాన్ని బలోపేతం చేసే దిశలో తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టం ద్వారా రామ రాజ్యం దిశగా అడుగు పడుతోంది. దీని ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 125 రోజుల ఉపాధి హామీ, వారం వారం వేతనాల చెల్లింపు, వేగవంతమైన చెల్లింపులు అమలవుతాయి. ఇలాంటి చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ, ఇండీ అలయెన్స్ కలిసి వ్యతిరేకించడం వెనుక అసలు కారణం ఏమిటో ప్రజలు గమనించాలి. వికసిత్ భారత్, శ్రీరామ్ అనే పేరు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత ద్వేషం అనే ప్రశ్నకు వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు. కాంగ్రెస్ పార్టీకి మహాత్మాగాంధీపై ప్రేమ ఉంటే, గతంలో విమానాశ్రయాలు, పథకాలకు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ వంటి వారి కుటుంబ సభ్యుల పేర్లే ఎందుకు పెట్టిందో సమాధానం చెప్పాలి. ఈ కొత్త చట్టం ద్వారా నీటి వనరుల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల నిర్మాణం, జీవనోపాధి మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి, గ్రామ ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ సీజన్‌లో కార్మికుల కొరత రాకుండా 60 రోజుల వర్క్ స్టాప్ వెసులుబాటు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగిందన్నారు. గతంలో 100 రోజుల పనిదినాలే ఉండగా, ఇప్పుడు ఈ కొత్త చట్టం ద్వారా పారదర్శకతతో 125 రోజుల పనిదినాలు కల్పించబడతాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ పథకంపై గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

కవిత పార్టీ పెట్టడం వల్ల మాకు వచ్చే నష్టమేమీ లేదు :

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయడం తమకు ఎలాంటి నష్టంలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చని, కేఏ పాల్ కూడా ఒక పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. కవిత ఆత్మగౌరవం దెబ్బతిన్నదని అది వారి కుటుంబానికి సంబంధించిన విషయమని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ప్రతి ఎన్నికల్లో గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. వీబీ జీ రామ్‌ జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది బయట పడింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎవరికీ ఒరిగిందేమీ లేదని పలు రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. పారదర్శకత లేని పథకాలే కాంగ్రెస్ పార్టీకి కావాలని విమర్శించారు.

Next Story