స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలి.. బీజేపీ చీఫ్ పిలుపు

by Ajay Maddhiboyina |

గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం మాత్రమే అనే వాస్తవాలను ప్రతి గ్రామానికి బిజెపి శ్రేణులు చేరవేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సూచించారు.

స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలి.. బీజేపీ చీఫ్ పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం మాత్రమే అనే వాస్తవాలను ప్రతి గ్రామానికి బిజెపి శ్రేణులు చేరవేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సూచించారు. గ్రామీణ రోడ్లు, పీఎం కిసాన్ పైసలు, మరుగుదొడ్లు, గ్రామీణ ఉపాధిహామీ పథకం, వీధి దీపాలు, స్మశానాల అభివృద్ధి వంటి పనులు కేంద్ర నిధులతోనే కొనసాగుతున్నాయని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు బిజెపి అభ్యర్థులు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, వారికి పార్టీ శ్రేణులు బలమైన మద్దతు అందించి గెలిపించాలనే దిశగా కృషి చేయాలన్నారు. బుధవారం రాష్ట్ర కార్యాలయం నుంచి స్ధానిక ఎన్నికలపై ఎంపీ, ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్​అభ్యర్ధులతో వీడియో కాన్పరెన్స్​నిర్వహించారు.

అనంతరం మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో బిజెపి అభ్యర్థులను రంగంలోకి దించాలని, ప్రజలు కోరుతున్న మార్పునకు బలాన్నిచ్చేలా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలన్నారు. ఈ ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడానికి బలమైన పునాది కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేండ్లుగా ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు విడుదల చేయలేదు. ఆరు గ్యారెంటీలు, 400 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫిబ్రవరి 2024కే సర్పంచ్‌ల పదవీకాలం పూర్తికాగా ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు జరపకపోవడంతో, గ్రామ పరిపాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారని సమావేశంలో నేతలు పేర్కొన్నారు. 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామస్థాయిలో ఖర్చు చేయకుండా, కేంద్ర నిధులను దారిమళ్లించడం వల్ల గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పంచాయతీల నిధులను విడుదల చేయకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు.ఈ సమావేశంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్ , బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు.

Next Story