వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నితిన్ ​నబీ రాష్ట్ర పర్యటన

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో వచ్చే నెలలో తమ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నితిన్ నబీన్ పర్యటన జరగనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్​రావు తెలిపారు.

వచ్చే నెలలో బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నితిన్ ​నబీ రాష్ట్ర పర్యటన
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వచ్చే నెలలో తమ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు నితిన్ నబీన్ పర్యటన జరగనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రాంచందర్​రావు తెలిపారు. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో పార్టీ బలోపేతానికి మరింత వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక కీలక అంశాలు, ప్రజా సమస్యలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రేవంత్​ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ప్రజల దృష్టిని మళ్లించేలా కొత్త కొత్త అంశాలను కావాలనే తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. ఇది ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నమని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాల్సిందేనని అన్నారు.

అసెంబ్లీకి రావడం ఏదో గొప్ప విషయంలా చూపించడం సరికాదని పేర్కొన్నారు. కేసీఆర్ సభకు రావడంపై గబ్బర్ సింగ్ జైలు నుంచి పారిపోయి వచ్చినట్లుగా హైప్ సృష్టించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. బీజేపీలో కొందరు లీక్ వీరులు వీక్ కాక తప్పదని, పార్టీ క్రమశిక్షణ, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా సార్​(Special Intensive Revision) ప్రక్రియ తెలంగాణలో కూడా అమలవ్వాల్సిందేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యాలకు సంబంధించిన అక్రమ ఓట్లు ఉన్నాయన్న విషయం వాస్తవమన్నారు. అలాంటి దొంగ ఓట్లను తప్పనిసరిగా తొలగించాల్సిందేనని, స్వచ్ఛమైన ఓటరు జాబితాల ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. అనంతరం నితిన్ నబిన్ సిన్హా తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన కార్యాచరణ, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై విలువైన సూచనలు చేశారు. సమిష్టికృషితో మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

Next Story