మున్సిపల్ ఎన్నికల వేళ చిక్కుల్లో CM రేవంత్ .. మహిళా కమిషన్‌కు MP అర్వింద్ కంప్లైంట్

by Gantepaka Srikanth |

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పర్యటనలో అవిభక్త కవలలైన వీణ-వాణిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మున్సిపల్ ఎన్నికల వేళ చిక్కుల్లో CM రేవంత్ .. మహిళా కమిషన్‌కు MP అర్వింద్ కంప్లైంట్
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పర్యటనలో అవిభక్త కవలలైన వీణ-వాణిలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. శనివారం రేవంత్ రెడ్డిపై జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్‌కు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అర్వింద్ నిజామాబాద్‌లో అవిభక్త కవలలైన వీణ-వాణిలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి మానవత్వం మరిచి మాట్లాడుతున్నారని ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. సీరియస్ పొలిటీషియన్‌గా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. వీణ-వాణిల ప్రస్తావన తీసుకురావడమే చాలా పెద్ద తప్పు అని అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్‌ది ఫెవీకాల్ బంధం అనే వరకూ ఓకే.. ఇలాంటి విమర్శలు ఆమోదయోగ్యంగానే ఉన్నాయి.. కానీ వీణ-వాణిల ప్రస్తావన తీసుకురాకుండా ఉండాల్సింది అని అర్వింద్ అన్నారు.

సీఎం రేవంత్ ఏమన్నారంటే..

‘మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని బొంద పెట్టాలి. బీజేపీ-బీఆర్ఎస్ వేరు వేరు కాదు. వీరిది ఫెవీకాల్ బంధం. వీణ-వాణిల బంధం విడదీయడానికి వీళ్లేకుండా ఎలా అయితే ఉందో.. బీఆర్ఎస్ - బీజేపీ మధ్య బంధం కూడా ఇప్పుడు అలాగే ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినా.. బీఆర్ఎస్‌కు వేసినా ఒక్కటే. ఆ రెండు పార్టీలకు వేసిన ఓట్లు మూసీలో పడ్డట్లే’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. దీంతో బీజేపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. మహిళా కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో అని ఆసక్తిగా మారింది.

Next Story