తెలంగాణలో గెలిచి మోడీకి కానుక ఇస్తాం: MP

by Gantepaka Srikanth |

ప్రధాని మోడీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అడుగుపెడుతుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి, ఉత్సాహం కనిపిస్తోందని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్​పేర్కొన్నారు.

తెలంగాణలో గెలిచి మోడీకి కానుక ఇస్తాం: MP
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రధాని మోడీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అడుగుపెడుతుండటంతో రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి, ఉత్సాహం కనిపిస్తోందని రాజ్యసభ సభ్యులు డా. లక్ష్మణ్​పేర్కొన్నారు. ఆయన రాక కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం పరేడ్​గ్రౌండ్​లో బహిరంగ సభకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ.. మోడీ అజెండా ఎప్పుడూ అభివృద్ధి, పేదల సంక్షేమం, పారదర్శక పాలన అనే అంశాలపైనే ఉంటుంది. దేశవ్యాప్తంగా పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీ, ఎన్డీయే పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ గెలిపిస్తున్నారని తాజా ఎన్నికల ఫలితాలు మరొకసారి స్పష్టంగా చూపించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, బీజేపీ పాలిత అస్సాంను మినహాయిస్తే, మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అవినీతి, కుటుంబ పాలన, ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ఆ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరించారు.

అస్సాంలో మాత్రం బీజేపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రో-ఇంకంబెన్సీ ఓటుతో మళ్లీ ఆశీర్వదించారు. తెలంగాణలో కూడా ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనపై విసుగుతో ఉన్నారు. ఈ రెండు పార్టీలూ రాష్ట్ర సంపదను దుర్వినియోగం చేశాయని, ఒకటి కుటుంబ పాలనతో, మరొకటి ఢిల్లీలోని కుటుంబ రాజకీయాలే ప్రాధాన్యంగా పనిచేస్తున్నాయని ప్రజలు గ్రహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయించిందన్నారు. తెలంగాణలో కూడా అహంకారపూరిత పాలనను ప్రజలు ఇప్పటికే తిరస్కరించిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. విద్యార్థులు, యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల్లో రేవంత్​ప్రభుత్వ వ్యతిరేక భావన స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చి ప్రధాన మంత్రి మోడీకి ఒక గొప్ప కానుకగా అందిస్తామని తెలిపారు.

Next Story