‘అసెంబ్లీలో ఆ అంశంపై ఖచ్చితంగా నిలదీస్తాం’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ కీలక నేత, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

‘అసెంబ్లీలో ఆ అంశంపై ఖచ్చితంగా నిలదీస్తాం’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేలు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ కీలక నేత, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 420 తప్పుడు హామీలతో పాటు దాదాపు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామని ప్రకటించారు. ప్రజాసమస్యల నుండి దృష్టి మళ్లించడానికి కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకువచ్చి నాటకాలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు – ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే అని అన్నారు.

లక్షకోట్ల అవినీతి కక్కిస్తా, ఆ డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, దాదాపు 2 సంవత్సరాల పాలన గడిచినా ఇప్పటివరకు అవినీతి పరులపై కేసులు నమోదు చేయలేదు. ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదని తెలిపారు. 100 రోజుల్లో హామీలను నెరవేర్చుతాం, 100 రోజుల్లో అవినీతి సొమ్మును రికవరీ చేస్తాం, 100 రోజుల్లో సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. దాదాపు 20 నెలలు గడిచినా ఇప్పటివరకు అవినీతి సొమ్ము బయట పెట్టలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి నివేదిక వచ్చిందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. విచారణను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? సీబీఐ విచారణ ఎందుకు చేయించడం లేదు? చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రజాసమస్యలను, అభివృద్ధి అంశాలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బీజేపీ పక్షాన ఖచ్చితంగా నిలదీస్తామని అన్నారు. మరోవైపు భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించి పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కేవలం నిర్మల్ నియోజకవర్గంలోనే దాదాపు 10 వేల ఎకరాల పంట నష్టం సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో అనేక ఇండ్లు మునిగిపోయాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం విచారకరం. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి హెలికాప్టర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లలో గాలితిరుగుడు తిరగడం కాదు, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించాలి. మంత్రులను క్షేత్రస్థాయికి పంపించి నష్టాన్ని అంచనా వేయాలి. తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలి. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన బృందం ఈ విషయాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించి అవసరమైన చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో శాసనసభ్యులు పాయల్ శంకర్, ధన్ పాల్ సూర్యనారాయణ, వెంకటరమణారెడ్డి, బీజేపీ శాసనమండలి పక్ష నాయకులు ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మల్క కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story