ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలి: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు

by Ramesh Naini |

తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లులో స్పష్టత లేదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు.

ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలి: బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురపాలక, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లులో స్పష్టత లేదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు విమర్శించారు. బిల్లుపై ప్రతిపక్ష సభ్యులకు పూర్తి సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం ముందుకు రావడం ప్రజాభిప్రాయానికి విరుద్ధమన్నారు. లోపాలను సరిదిద్దకుండా బిల్లును రూపొందించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం 12 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిందని గుర్తు చేసిన హరీశ్‌బాబు, ఇప్పుడు ప్రతిపాదిత విలీనాలతో కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఒకే కార్పొరేషన్‌గా మార్చడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

51 గ్రామ పంచాయతీలను ముందుగా మున్సిపాలిటీల్లో, వెంటనే జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ ప్రక్రియతో పచ్చదనంతో కలకలలాడే గ్రామాలు కనుమరుగయ్యాయని, చేతివృత్తులు, కులవృత్తులకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. విలీనాలు ఒక పార్టీకి అనుకూలంగా జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. విలీనంతో ఆయా గ్రామాల్లో పన్నులు భారీగా పెరిగే అవకాశం ఉందని, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోందని హరీశ్‌బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story