సీఎం రేవంత్​ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు : బీజేఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి

by Muthe.Rajitha |

పాకిస్తాన్ తో జరిగిన పోరులో మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిందంటూ సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ వ‌ర్థంతి స‌భ‌లో మాట్లాడ‌డం ఆయ‌న అజ్ఞానానికి నిద‌ర్శనమని బీజేఎల్పీనేత మహేశ్వర్​రెడ్డి విమర్శించారు.

సీఎం రేవంత్​ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు : బీజేఎల్పీ నేత మహేశ్వర్​ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాకిస్తాన్ తో జరిగిన పోరులో మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిందంటూ సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ వ‌ర్థంతి స‌భ‌లో మాట్లాడ‌డం ఆయ‌న అజ్ఞానానికి నిద‌ర్శనమని బీజేఎల్పీనేత మహేశ్వర్​రెడ్డి విమర్శించారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ దేశ భ‌ద్రత‌, విదేశాంగ వ్యవ‌హారాల‌కు సంబంధించిన అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి త‌న అజ్ఞానంతో అబ‌ద్దాల‌ను ప్రచారం చేయ‌డం అత్యంత దుర్మార్గం, ఇది దేశద్రోహ చ‌ర్యతో స‌మానమన్నారు. పాకిస్తానులోని ఉగ్రవాద శిబిరాల‌ను భార‌త సైన్యం ప‌లు సార్లు ధ్వంసం చేయ‌డ‌మే పాక్ ప్రేరేపిత టెర్రరిజాన్ని అంత‌మొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోంద‌న‌డానికి నిద‌ర్శనమని పేర్కొన్నారు. బిజెపి నేత‌ల‌ను విమ‌ర్శించే విష‌యంలో రాహుల్ గాంధీ రాసిచ్చిన స్క్రిప్టునే రేవంత్ రెడ్డి చ‌దివారని మండిపడ్డారు. పాకిస్తాన్​పై భార‌త సైన్యం సాగిస్తున్న ఆప‌రేష‌న్ సింధూర్ కు అండ‌గా నిల‌బ‌డాల్సిన కాంగ్రెస్ అగ్ర నేత‌లు భార‌త సైన్యాన్ని ప‌లుచ‌న చేసే వ్యాఖ్యలు చేయడం దివాళాకోరు రాజ‌కీయాల‌కు నిలువుట్టదమన్నారు.

కాంగ్రెస్ తీరు చేస్తుంటే వారి పార్టీ పేరును భార‌త జాతీయ కాంగ్రెస్ ను కాస్తా పాకిస్తాన్ జాతీయ కాంగ్రెస్ గా మార్చుకున్నారా అనే సందేహం భార‌తీయుల‌కు క‌లుగుతోందన్నారు. ఎందుకంటే హ‌స్తం పార్టీది ఎప్పుడూ పాకిస్తాన్ అనుకూల విధాన‌మే. భార‌త తొలి ప్రధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ అవ‌లంభించిన హిందూ వ్యతిరేక‌, ముస్లిం అనుకూల వైఖ‌రి, అమ‌లు చేసిన కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిప‌త్తి వంటి విధానాల‌తో అక్కడ పాకిస్తాన్ ప్రేరేపిత‌ టెర్రరిజం వేళ్లూనుకుందన్నారు. కాశ్మీరులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంత‌మొందించేందుకు మోడీ స‌ర్కారు చేస్తున్న కృషిని కాంగ్రెస్ నేత‌లు అభినందించ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు. కానీ పాకిస్తాను అనుకూల ధోర‌ణిలో మాట్లాడ‌డం మాత్రం మ‌న దేశ ప్రయోజ‌నాల‌కు విఘాతం క‌లిగించ‌డ‌మేనన్నారు.

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిజానికి వ్యతిరేకంగా బిజేవైఎం జాతీయ నేత‌గా సీమ సుర‌క్షా జాగ‌ర‌ణ యాత్ర చేప‌ట్టిన దేశ‌భ‌క్తుడు అన్నారు. టెర్రరిజాన్ని అంతం చేయాల‌నే సంక‌ల్పం ఉన్న కిష‌న్ రెడ్డి ఉగ్రదాడుల వేళ ప్రధాని మోడీకి అండ‌గా లేర‌ని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడ‌డం పూర్తిగా రాజ‌కీయ దురుద్దేశ పూరితం, దివాళాకోరు తనంగా ఉందన్నారు. గుల్జార్ హౌజ్ లో ప్రమాదం జ‌రిగి 17 మంది చ‌నిపోతే, వెంట‌నే సంఘ‌ట‌నా స్ధలానికి వెళ్లి ప‌రిస్ధితిని స‌మీక్షించి, బాధితుల కుటంబాల‌ను ఓదార్చిన నిబ‌ద్దత‌గ‌ల నాయకుడన్నారు. బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డి భ‌రోసా ఇవ్వాల్సిన సీఎం రేవంత్ రెడ్డి త‌న నివాసంలో దుప్పటి క‌ప్పుకుని ప‌డుకోవ‌డం ఆయ‌న‌ బాధ్యాతారాహిత్యానికి నిద‌ర్శనమని పేర్కొన్నారు.

Next Story