బీసీని సీఎంను చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ

by Gantepaka Srikanth |

బీసీని సీఎంను చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ

బీసీని సీఎంను చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎంపీ లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆఫీసులో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనకు ప్రతీ కార్యకర్త ప్రతినబూని ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా బీసీలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉన్నదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని.. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అలవికాని హామీలిచ్చి మోసగించారని ఆరోపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో 42 శాతం కాంట్రాక్టులు ఇస్తామని, బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తామని ప్రకటించి మాట తప్పారని అన్నారు. తెలంగాణ రోల్ మోడల్ అంటూ చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం అశాస్త్రీయ సర్వేలు, తూతూ మంత్ర విధానాలు, కోరలు లేని డెడికేషన్ కమిషన్, ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో చేసిన అసంబద్ధ సర్వేలు చేపట్టిందన్నారు.

కులగణన, సర్వేలు, కోటా నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఆర్డినెన్సులు, జీవోలు.. ఇలా వెనుకబడిన వర్గాలను మభ్యపెట్టి, చివరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారని, అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో కూడా అభాసుపాలయ్యారని, కోర్టు కేసులకు లక్షల రూపాయలు అడ్వకేట్లకు వెచ్చించారని అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల సమయంలో బీసీ ఓట్ల కోసం తెలంగాణలో అశాస్త్రీయంగా హడావుడిగా సర్వేలు జరిపారని.. ఆ తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చెంపపెట్టు తీర్పు ఇచ్చారని అన్నారు. బీసీలకు 42 శాతం మంత్రి పదవులు ఇవ్వడానికైనా, బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఇవ్వడానికైనా ఎక్కడ కోర్టు అడ్డుపడిందో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హయాంలో 1988లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉండేవని.. ఇవాళ వాటిని 17 శాతానికి తగ్గించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, బి.జయశ్రీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారి, వేముల అశోక్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story