బీఆర్ఎస్‌కు ప్రాణం విలువ తెలియదు: అధికార పార్టీపై నిప్పులు చెరిగిన కార్పొరేటర్స్

by Disha Web Desk 19 |
బీఆర్ఎస్‌కు ప్రాణం విలువ తెలియదు: అధికార పార్టీపై నిప్పులు చెరిగిన కార్పొరేటర్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ నేతలకు ప్రాణం విలువ తెలియదని, చిన్నారి మరణం వారికి చాలా చిన్న విషయంలా కనిపిస్తోందని బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు క్లీన్ చేసేందుకు కూడా స్టాఫ్ సరిపడ లేరని, స్టాఫ్‌ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. నాలా వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగడి అన్న విధంగా ఉందని, నిధులు ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదన్నారు. అభివృద్ధిపై నేతలకు ఒక స్ట్రాటజీ లేదని విమర్శలు చేశారు.

చిన్నారి మౌనిక మృతిపై ఇప్పటి వరకు మంత్రి స్పందించలేదని వారు ధ్వజమెత్తారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో అగ్ని ప్రమాదాలు చెలరేగుతున్నాయని, వానలు పడితే మునిగిపోతున్న దుస్థితి ఉందన్నారు. ప్రజలు ఓడించినా ఎంఐఎం నేతలతో దొంగ పొత్తు పెట్టుకుని గ్రేటర్‌లో అధికారం లోకి వచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక కార్పొరేటర్లే బాధ్యత వహించాలని మేయర్ అనడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చిన్నారి మౌనిక మరణానికి మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి కారణమని వారు ఆరోపణలు చేశారు. పనులు చేయకున్నా బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. విశ్వనగరం అని చెప్పుకొని దందాలు సాగిస్తున్నారని మండిపడ్డారు.

అప్పులపాలైన జీహెచ్ఎంసీ బాధ్యతలను మంత్రి కేటీఆర్ తీసుకుంటారా, తలసాని తీసుకుంటారా స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ చేస్తున్న నిర్లక్ష్యానికి తాము బాధ్యులం అవుతున్నామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఏ పని చేసినా స్థానిక కార్పొరేటర్‌కు సమాచారం ఇవ్వకుండా మంత్రి తలసాని రాజకీయాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.

హైదారాబాద్ నుంచి వచ్చే ఆదాయంలో ఇక్కడి అభివృద్ధికి ఎంత ఖర్చు చేస్తున్నారో సమాధానం చెప్పాలని కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మౌనిక మృతికి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రేటర్ పరిధిలో ఇలాంటి ఘటనలే పునరావృతమైతే పన్ను నిరాకరణ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు శంకర్ యాదవ్, వంగ మధుసూదన్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed