ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ​అనవసరం రాద్దాంతం : బీజేపీ చీఫ్​ రాంచందర్​రావు

by Muthe.Rajitha |

కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం పేరులో మార్పు విషయంలో కావాలనే అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తోందని,ఆసలు ఈ పథకం రద్దు కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు స్పష్టం చేశారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ ​అనవసరం రాద్దాంతం : బీజేపీ చీఫ్​ రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం పేరులో మార్పు విషయంలో కావాలనే అనవసర రాజకీయ రాద్ధాంతం చేస్తోందని,ఆసలు ఈ పథకం రద్దు కాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు స్పష్టం చేశారు. గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్-2047 లక్ష్యానికి అనుగుణంగా ‘వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ తీసుకువచ్చింది. కాంగ్రెస్ కు నిజంగా ఉపాధి హామీ పథకంపై ప్రేమ ఉంటే, వారు తమ 10 ఏళ్ల పాలనలో చేసిన ఖర్చు గురించి ప్రజలకు చెప్పాలని డిమాండ్​చేశారు.

బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వారి పాలనలో ఈ పథకానికి సుమారు రూ.1 లక్ష కోట్లే ఖర్చు చేశారని మోడీ అధికారం చేపట్టిన తరువాత 11 ఏళ్లలోనే రూ.8 లక్షల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే పథకం ప్రజలకు నిజంగా ఉపయోగపడేలా తీసుకెళ్లింది మోడీ ప్రభుత్వమేనని ప్రస్తుతం ఈపథకాన్ని పక్కన పెట్టలేదు, మరింత బలోపేతం చేసింది. నిధులు, పనుల పరిధిని పెంచింది, లబ్ధిదారుల సంఖ్య పెరగాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ రోజులను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచిందని గుర్తు చేశారు.

ఈ పథకం పేరులో రామ్ అనే పదం ఉండటమేనా కాంగ్రెస్​అభ్యంతరం చేసినట్లు ఉందన్నారు. రామ రాజ్యం అనే భావన మహాత్మా గాంధీ కూడా నమ్మిన సిద్ధాంతమేనని గాంధీ వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ నేతలకు రామ్ అనే పదంపై అభ్యంతరం ఎందుకని మండిపడ్డారు. కాంగ్రెస్​పార్టీకి ప్రజా సంక్షేమం కంటే రాజకీయ ద్వేషమే ఎక్కువ ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు ఇంకా తుదితీర్పు ఇవ్వలేదు. సోనియా , రాహుల్ గాంధీ నిర్దోషులని కోర్టు చెప్పలేదని ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తూ తప్పుదారి పట్టించే రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కార్యాలయాల ముందు కావాలని తప్పుడు ప్రచారంతో ధర్నాలు చేసినా ప్రధాని మోడీపై అనుచిత భాష వాడితే సహించమని, ప్రజలను తప్పుదోవ పట్టించే దిగజారుడు రాజకీయాలకు బలమైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. పథకం పేరు మారితే తప్పమేమిటి, కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బయటపడింది. తెలంగాణ తల్లి రూపం, విగ్రహం మార్చినప్పుడు లేని సమస్య ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తోందని ప్రశ్నించారు. గాంధీజీ పేరు వాడుకోవడం కాదని వారిని గౌరవించేది వారి ఆలోచనలను అమలు చేసేలా ప్రజల జీవితాల్లో అభివృద్ధి దిశగా మార్పు తీసుకురావడమే బిజెపి విధానమని తేల్చి చెప్పారు.

Next Story