మావోయిస్టులు తుపాకులు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి : బీజేపీ చీప్​ రాంచందర్​రావు

by Muthe.Rajitha |

స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉండి సమావేశాలు నిర్వహిస్తే 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుండి విడుదల అయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు.

మావోయిస్టులు తుపాకులు వీడి జనజీవన స్రవంతిలో కలవాలి : బీజేపీ చీప్​ రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉండి సమావేశాలు నిర్వహిస్తే 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుండి విడుదల అయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్​రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 21 నెలలు దాటినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ. 4 వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి.

ఎన్నికలు జరిపి పాలకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడే ఆ నిధుల విడుదల సాధ్య మైతుందన్నారు. మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్​పేరుతో బీసీల ఓట్లు పొందడానికే ఉపయోగించుకుంది తప్ప రిజర్వేషన్లు ఇవ్వడానికి తగిన న్యాయపరమైన చర్యలు మాత్రం తీసుకోలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా, కేవలం పార్టీ స్థాయిలోనే ఇస్తామన్న ధోరణి అన్యాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఇతర పార్టీలపై మోపడానికి ప్రయత్నించడం సరైనది కాదని, కనీసం ఇప్పుడైనా సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని సూచించారు.

బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు సంబంధించి అన్ని వివరాలను పరిశీలించి, పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి బీసీలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ‘కగార్’ ద్వారా దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టు చర్యలను నిర్మూలించే దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుందన్నారు.

అనేక దశాబ్దాలుగా మావోయిస్టులు పేదలను, దళితులు, గిరిజనులను, పోలీసులను, పోలీస్‌ ఇన్ఫార్మర్‌ల పేరుతో అనేక మంది ప్రజలతో పాటు బిజెపి, ఏబీవీపీ కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నారు. కేంద్రం మావోయిస్టులకు తుపాకులు వదిలి వచ్చే మార్చి 31లోగా లొంగిపోవాలని బలంగా హెచ్చరిక జారీ చేసింది. వారికి లొంగిపోవడానికి అవకాశం కూడా ఇచ్చింది.

అందుకే మావోయిస్టులు తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవాలన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోంది. మావోయిస్టులు కొంతమంది దుష్టశక్తుల మాటలు నమ్మి సరెండర్ కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారని తక్షణమే తుపాకీ వీడి, ప్రజల జీవితంలో కలవాలని సూచించారు.

Next Story