మున్సిపల్​ ఎన్నికల్లో అన్నీ సీట్లకు పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్​రావు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తుందని, ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు పోతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తెలిపారు.

మున్సిపల్​ ఎన్నికల్లో అన్నీ సీట్లకు పోటీ చేస్తాం: బీజేపీ చీఫ్ రాంచందర్​రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తుందని, ఘన విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు పోతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తెలిపారు. గతంలో ప్రజలు బీఆర్ఎస్‌కు, తరువాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే రెండు పార్టీలు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచాయని విమర్శించారు. మాటలకే పరిమితమైన పాలన చేశారని, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలతో పాటే ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వ్యవస్థను 30 నుంచి 40 శాతానికి పెంచిందని ఆరోపించారు. మంత్రుల మధ్య కలహాలు, కాంట్రాక్టర్లు, కమిషన్ వ్యవస్థ రాష్ట్రంలో విస్తరించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ పాలనలో తీవ్రంగా విఫలమయ్యాయని మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో బీహార్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బీజేపీ విజయాలు సాధించిందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి పునాది వేస్తామని అన్నారు. సేవ్ తెలంగాణ, ఓట్ ఫర్ బీజేపీ నినాదంతో ప్రజల ముందుకు వెళ్లతామన్నారు. బుధవారం ఆ పార్టీలో పెద్దఎత్తున జూనియర్ , సీనియర్ న్యాయవాదులు చేరారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధాని మోడీ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన, సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులై బిజెపిలో పెద్దఎత్తున చేరికలు జరిగాయని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలం నాటి చెల్లని చట్టాలను భారతీయ పద్ధతికి అనుగుణంగా మార్చడం జరిగిందని వెల్లడించారు.

1850 తర్వాత వచ్చిన కొన్ని బ్రిటిష్ చట్టాలను స్వతంత్ర భారత న్యాయ వ్యవస్థకు అనుకూలంగా మార్చారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో వేగవంతమైన అభివృద్ధిని చూసి అడ్వకేట్లు, సమాజం దీనిని స్వాగతించారని గుర్తుచేశారు. పెండింగ్ కేసులు పరిష్కరించడం, ఖాళీగా ఉన్న జడ్జ్ పోస్టులను వేగవంతంగా భర్తీ చేయడం మోడీ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఖాళీగా ఉన్న జడ్జ్ పోస్టులను ఆలస్యం లేకుండా నింపడం జరుగుతుందన్నారు. తెలంగాణలో దాదాపు 150 మంది యువ న్యాయవాదులు, ముఖ్యంగా సీనియర్ అడ్వకేట్లతో పాటు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌లో అవకాశం పొందారని తెలిపారు. వెనుకబడిన, పేద వర్గాలకు పెద్దపీట వేయడం జరిగింది. తెలంగాణను అభివృద్ధి రాష్ట్రంగా మార్చగలిగేది బీజేపీకే సాధ్యమని, పిల్లల భవిష్యత్తు, రైతుల జీవితం, రాష్ట్ర గౌరవం కోసం తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. దేశ భవిష్యత్తు, తెలంగాణ రక్షణ కోసం ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Next Story