- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల కష్టాలు
దేవుడు కరుణించినా పూజారి కనికరించని చందంగా ఉంది వైరా మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిస్థితి.

ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల కష్టాలు
- 10రోజులుగా ఫొటోలు అప్ లోడ్ చేయని వైనం
- 20 వార్డులకు ఏడుగురే వార్డ్ ఆఫీసర్లు
- వైరా మున్సిపాలిటీలో విచిత్ర పరిస్థితి
- త్వరగా బిల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారుల వేడుకోలు
దిశ, వైరా : దేవుడు కరుణించినా పూజారి కనికరించని చందంగా ఉంది వైరా మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిస్థితి. మున్సిపాలిటీలోని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బేస్మెంట్ లెవల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసినప్పటికీ లాగిన్ లో ఫొటోలు అప్లోడ్ చేసే నాథుడు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 10 రోజులుగా లాగిన్ లో ఫొటోలు అప్లోడ్ చేయకపోవడంతో బిల్లులు రాక లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను నిలిపివేశారు. వైరా మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డుల్లో సుమారు 400 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ళను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే వైరా పట్టణంతో పాటు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో సుమారు 100 మంది లబ్ధిదారులు బేస్మెంట్ లెవల్లో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ముందుగా ఖాళీ స్థలంలో ముగ్గు పోసి జియో టాగింగ్ తో ఫొటో తీయాల్సి ఉంటుంది. బేస్మెంట్ లెవెల్ లో నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రభుత్వ లాగిన్ లో వార్డ్ ఆఫీసర్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గృహ నిర్మాణ శాఖ ఏఈ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టారో లేదో చూసి మరో ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నాలుగు దశల్లో ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది. బేస్మెంట్ లెవల్ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత లక్ష రూపాయలు, రూప్ లెవల్ నిర్మాణం చేపట్టిన తర్వాత మరో లక్ష రూపాయలు, స్లాబ్ పోసిన తర్వాత రెండు లక్షల రూపాయలు, పూర్తిస్థాయిలో ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత లక్ష రూపాయల నగదును ప్రభుత్వం అందజేస్తుంది. వైరా మున్సిపాలిటీలో ఉన్న 20 వార్డ్ ఆఫీసర్లలో 13 మంది రెవెన్యూ గ్రామ పాలన అధికారులుగా ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. దీంతో మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లాగిన్ లో ఫొటోలు తీసేవారు కరువయ్యారు. ఈ విషయమై ఇప్పటికే మున్సిపాలిటీ కమిషనర్ కు పలువురు లబ్ధిదారులు రాజకీయ నాయకుల ద్వారా సమస్యను వివరించారు. అయినప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలను తీసేందుకు మున్సిపాలిటీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయలేకపోయారు. దీంతో వైరా మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఆరంభ శూరత్వంగా మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి సోమవారం లాగిన్ లో అప్లోడ్ అయిన ఫొటోల ఆధారంగా లబ్ధిదారులకు విధిగా నగదును ఖాతాల్లోకి జమ చేస్తుంది. మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు లేకపోవడంతో గత రెండు సోమవారాలల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే నగదు అందటం లేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వైరా మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల ఫొటోలను వెంటనే లాగిన్ లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.






