PM MODI తెలంగాణ పర్యటనపై బిగ్ అప్‌డేట్

by Gantepaka Srikanth |

తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.

PM MODI తెలంగాణ పర్యటనపై బిగ్ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మే 10వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనపై రాజకీయంగా, పాలనాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైల్వే వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ప్రస్తుతం తెలంగాణలో సుమారు రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కీలక ప్రాజెక్టుల అప్‌డేట్స్..

హైదరాబాద్ ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుండి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. ములుగులో ఏర్పాటు చేయనున్న సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రధాన మంత్రి కాకతీయ టెక్స్‌టైల్ పార్కు'ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా కేంద్రం మంజూరు చేసిన ఏడు మెగా టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు దక్కిన ఈ పార్కు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కీలకం కానుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని రాకతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.

Next Story