ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-12 08:46:56  IST  )

తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో దేశ అత్యున్నత సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఇవాళ తుది తీర్పును వెలువరిచింది. ఈ కేసు విచారణ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఇప్పటికే విచారణ జరిపి, తగిన నిర్ణయం తీసుకున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు పిటిషన్లను స్పీకర్ కార్యాలయం పరిష్కరించిందని ధర్మాసనానికి వివరించారు.

ఇక విచారణ అక్కర్లేదు..

అయితే, అభిషేక్ మను సింఘ్వీ వాదనలతో జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవించింది. స్పీకర్ ఇప్పటికే ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకున్నందున, ఇక ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని భావించిన కోర్టు విచారణ ముగిసినట్లేనని ప్రకటించింది. అదేవిధంగా 2 రోజుల్లో స్పీకర్ తన తీర్పు కాపీలు ఫిర్యాదుదారులకు ఇవ్వాలన్న సుప్రీంకోర్టు పేర్కొంది.

కాగా, తెలంగాణలో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ నాయకత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేస్తున్నారని, తక్షణమే వారిపై అనర్హత వేటు వేసేలా ఆదేశించాలని బీఆర్‌ఎస్ కోరింది. అయితే, తాజాగా స్పీకర్ అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ వివాదం న్యాయపరంగా సుప్రీంకోర్టులో ముగిసింది. అయితే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ తదుపరి ఎలాంటి స్టెప్ వేయబోతుందనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో ఆసక్తికరంగా మారింది.

Next Story