- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త డీసీసీ అధ్యక్షులకు బిగ్ టాస్క్.. పంచాయతీ ఎన్నికల్లో వంద శాతం సీట్లే టార్గెట్
తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఇటీవలనే రెండు జిల్లాలు మినహా నూతన డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఇటీవలనే రెండు జిల్లాలు మినహా నూతన డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తి చేసింది. ఈ డీసీసీల నియామకం తర్వాత కొన్ని జిల్లాల్లో వర్గ విభేదాలు తెరపైకి వచ్చాయి. మరికొన్ని జిల్లాల్లో నేతల మధ్య గ్రూపులు బయటపడ్డాయి. అయితే అక్కడక్కడ మినహా మెజార్టీ జిల్లాల్లో డీసీసీల నియామకాల పట్ల పార్టీ శ్రేణుల్లో సానుకూలత ఏర్పడింది. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ కొత్త జిల్లా అధ్యక్షుల నియామకం ఒక రకంగా పార్టీకి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే నూతన డీసీసీల నియామకం జరిగిన తర్వాత గాంధీ భవన్‌లో నిర్వహించిన టీపీసీసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్‌లు కొత్త డీసీసీ చీఫ్‌లకు దిశా నిర్దేశం చేశారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన కార్యాచరణపై అనేక సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ కొత్త జిల్లా అధ్యక్షులు తమ పనితీరును నిరూపించుకునేందుకు 6 నెలల గడువు ఇచ్చారు. ఈ లోపు వారి పని తీరు మెరుగ్గా లేకుంటే వారి స్థానం ఖాళీ అవుతుందని సీఎం స్పష్టం చేశారు.
కొత్త జిల్లా అధ్యక్షుల ముందు పెద్ద టాస్క్
ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న సమయంలోనే మీనాక్షి నటరాజన్ కల్పించుకొని గుజరాత్‌లో డీసీసీల నియామకం కూడా సృజన్ సంఘటన్ అభియాన్ ద్వారా చేపట్టామని, నియమితులైన వారికి 3 నెలల గడువు విధించామన్నారు. సీఎం, టీపీసీసీలు డీసీసీల ఎంపిక కోసం సిఫార్సులు చేయలేదని, ఏఐసీసీల పరిశీలకులు, కార్యకర్తలు, జిల్లా నేతల అభిప్రాయాలతో నియామకం జరిగినందున పనితీరును కనబర్చాలన్నారు. సీఎం తన ప్రసంగంలో సంక్షేమ పథకాల అమలు బాధ్యత ఈ జిల్లా అధ్యక్షులకు అప్పగిస్తున్నామని చెప్పారు. ప్రధానంగా ఇందిరమ్మ చీరల పంపిణీని దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. ఏ జిల్లా నుంచైనా తనకు ఫిర్యాదులు రాకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అటు ప్రస్తుతం నడుస్తున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ క్లీన్ స్వీప్ చేసి వందశాతం సీట్లు సాధించేలా వ్యవహరించాలని ముఖ్య నేతలు వారికి ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. దీనితో ఈ 6 నెలల్లో అటు లోకల్ పోరులో సీట్ల సాధన, జిల్లాల్లో నేతల మధ్య సఖ్యత తీసుకురావడం, ఆయా జిల్లాల్లో గ్రూపులుగా, వర్గాలుగా విడిపోయిన నేతలను ఒక్కతాటిపైకి తెచ్చే పెద్ద టాస్క్ కొత్త జిల్లా అధ్యక్షుల ముందుంది.
గడువుతో మైరుగైన పనితీరుకు చాన్స్!
కొన్ని జిల్లాల్లో నూతన డీసీసీ చీఫ్‌లను జిల్లాల్లోని అగ్రనేతలు వ్యతిరేకిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో డీసీసీ పదవి కోసం పెద్ద ఎత్తున పోటీపడినా ఇరు వర్గాల నేతలను కాదని మధ్యే మార్గంగా మూడో వర్గానికో, లేక తటస్థులకో డీసీసీ చీఫ్పదవులను కట్టబెట్టారు. ఇలాంటి అంశాలన్నీ నూతన డీసీసీ చీఫ్‌లు చక్కబెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇందిరమ్మ చీరలను గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెలలో 65 లక్షల దాకా పంపిణీ చేయాల్సి ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో మార్చిలో 35 లక్షల చీరలను పంపిణీ చేయాల్సి ఉంది. మొత్తంగా కోటి చీరల పంపిణీ బాధ్యత డీసీసీలపై పడటంతో వారు జాగ్రత్తగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ నూతనంగా డీసీసీలను నియమించినప్పుడు 6 నెలల గడువు అనేది లేదని, ఇప్పుడు విధించడం ద్వారా వారు మెరుగైన పనితీరును కనబరుస్తారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 6 నెలల గడువుతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం ఏ విధంగా చేస్తారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.






