- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి హామీ కూలీలకు బిగ్ షాక్.. పని దినాలను తగ్గించిన కేంద్రం
తెలంగాణలో ఉపాధి హామీ పనిదినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఉపాధి హామీ పనిదినాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా కోత విధించింది. ఉపాధి కోసం కూలీలు వలసలు వెళ్లకుండా, ఆకలి చావులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, కేంద్రప్రభుత్వం రోజురోజుకూ పలు నిబంధనలు, మార్గదర్శకాల పేరిట ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తు్న్నదని పెద్దఎత్తున విమర్శలొస్తున్నాయి. ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువగా ఉపయోగించుకునే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ, కేంద్రం తెలంగాణకు ఏటా కేటాయించే పనిదినాల్లో సగానికి సగం కోత పెట్టింది. గత ఐదు సంవత్సరాల ఉపాధి హామీ పనిదినాలను పరిశీలిస్తే ఏనాడూ 12 కోట్లకు తక్కువగా నమోదు కాలేదు.
కానీ, ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి మాత్రం గత పని దినాల్లో సగమే కేటాయించింది. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత తక్కువగా పనిదినాలను ఏనాడూ కేటాయించలేదని, కేంద్రం తీరు ‘ఉపాధి హామీ’ని నిర్వీర్యం చేసేలా ఉందని గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ నిపుణులు, సంఘాలు ఆరోపిస్తున్నాయి. కూలీలు వలస పోకుండా రూపొందించిన కార్యక్రమాన్ని నిధులకు ముడి పెట్టి ఏదో ఒక రకంగా పనిదినాలను, బడ్జెట్‌ను తక్కువగా కేటాయించకోవడమే ప్రధాన అంశంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరిస్తుందని విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఎన్నడూ చేయలేదని కాంగ్రెస్నాయకులు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి ఏడాది కేవలం 6.5 కోట్ల పని దినాలను కేంద్రం కేటాయించింది.
సప్లై డ్రివెన్‌గా ఉపాధి హామీ పనులు చేపట్టండి : కేంద్రం
గతేడాది 8 కోట్ల పనిదినాలను కేంద్రం కేటాయించింది.కానీ, డిమాండ్ అధికంగా ఉండటంతో 12 కోట్ల పనిదినాలను పూర్తి చేశారు. ఉపాధి హామీ చట్టం ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు పనిదినాలకు అనుగుణంగా కేంద్రం అనుమతులిచ్చింది. కానీ, ఈ ఏడాది కేవలం 6.5 కోట్ల పనిదినాలను కేటాయించారు. అంతకు మించి పనులు చేయించొద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు అందాయి. దేశవ్యాప్తంగా ఉపాధి హమీ పనులపై కేంద్రం ఆంక్షలు విధించినట్లు తెలిసింది. గతంలో మాదిరిగా డిమాండ్‌కు అనుగుణంగా పనిదినాలు పెంచబోమని కేంద్రం తెలిపింది.కేటాయించిన పని దినాల ప్రకారమే పనులు చేయించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ‘డిమాండ్ డ్రివెన్ గా కాకుండా.. సప్లై డ్రివెన్’గా ఉపాధిహమీ పనులు కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డిమాండ్‌ను బట్టి పనిదినాలను కేంద్రం పెంచకపోతే..రాష్ట్రంలో ఉపాధి ఆధారిత పనిదినాలు త్గగుతాయని, దీంతో కూలీలపై ఆ ప్రభావం స్పష్టంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. పనిదినాలను పెంచేలా కేంద్రానికి లేఖ రాసే యోచనలో మంత్రి సీతక్క ఉన్నట్లుగా సమాచారం. కేంద్రం కేటాయించిన పనిదినాలు ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే రెండు నెలల్లోనే పూర్తి అయ్యాయి. గత ఐదేళ్ల లెక్కలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.
జిల్లాల వారీగా వర్క్ ప్లాన్ సిద్ధం
గత ఆర్థిక సంవత్సరంలో రూ.8.57 కోట్ల పనిదినాలు కేవలం ఏప్రిల్, మే నెలల్లోనే పూర్తి అయ్యాయి. కానీ, కేంద్రం ఈ ఏడాది మొత్తానికి కేవలం 6.5 కోట్ల పనిదినాలను మాత్రమే కేటాయించింది. ఈ నేపథ్యంలో కేంద్రం కేటాయించిన పని దినాలతోనే 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లాల వారీగా ఉపాధి హమీ పనులు, నిధులు, వర్క్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ఫైల్ పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం సంతకం చేశారు. ఉపాధీ హమీ పథకం కోసం 2025–26 ఏడాదిలో మొత్తం రూ. 2,708 కోట్ల నిధులు మంజూరు చేశారు. జిల్లాల వారీగా చేపట్టే పనుల కార్యచరణను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందులో రూ.1,625 కోట్లు వేతనాలు, రూ.1,083 కోట్ల మేర మెటీరియల్ కంపోనెంట్ నిధులను ప్రతిపాదించారు. ఉపాధి హమీ పనుల కింద మహిళా శక్తి, ఉపాధి భరోసా, పొలం బాట, ఫల వనాలు, వనమహోత్సవం, జల నిధి, రూరల్ సానిటేషన్, మౌళిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా చేపట్టే పనులకు మంత్రి ఆమోదం తెలిపారు.
ఉపాధి హామీ పనిదినాల వివరాలు..
––––––––––––––––––––––––––––––––––---------------
ఆర్థిక సంవత్సరం - మే వరకు చేసిన - మొత్తం చేసిన
పనిదినాలు పనిదినాలు
––––––––––––––––––––––––––––––––––------------
2024-25 - 8.57 - 12.22
2023-24 - 5.44 - 12.08
2022-23 - 7.21 - 12.18
2021-22 - 7.49 - 14.42
2020-21 - 8.36 - 15.64






